Microsoft: గ్లోబల్ మైక్రోసాఫ్ట్ ఎర్రర్.. బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అంటే ఏమిటి?

బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్‌ని మైక్రోసాఫ్ట్ సాధారంగా బ్లాక్ స్క్రీన్ ఎర్రర్ లేదా స్టాప్ కోడ్ ఎర్రర్‌గా పిలుస్తారు.

Update: 2024-07-19 16:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ గురించే చర్చంతా జరుగుతోంది. అన్ని రకాల సేవలు, పనులు టెక్నాలజీపైనే ఆధారపడి నిర్వహిస్తున్న ఇలాంటి సమయంలో మైక్రోసాఫ్ట్ విండోస్‌లో వచ్చిన ఎర్రర్ చాలా గందరగోళాన్ని సృష్టించింది. మైక్రోసాఫ్ట్ పరిభాషలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్(బీఎస్ఓడీ)గా పిలిచే ఎర్రర్‌ను యూజర్లు ఎదుర్కొన్నారు. లక్షలాది మంది యూజర్ల కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు షట్‌డౌన్ లేదా రీస్టార్ట్ అవడంతో వారు కంగారు పడ్డారు. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లోని కీలక బ్యాంకింగ్, విమానయాన, మీడియా సంస్థలు, స్టాక్ ఎక్స్ఛేంజీలు సహా అన్నిటిపైనా ఈ బీఎస్ఓడీ ప్రభావం కనిపించింది. మైక్రోసాఫ్ట్ సంస్థకు ఈ సమస్య కొత్త కానప్పటికీ, శుక్రవారం జరిగిన పరిణామం విస్తృతంగా ఉండటంతో అంతర్జాతీయంగా దీని గురించే అందరూ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్(బీఎస్ఓడీ) గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అంటే..

బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్‌ని మైక్రోసాఫ్ట్ సాధారంగా బ్లాక్ స్క్రీన్ ఎర్రర్ లేదా స్టాప్ కోడ్ ఎర్రర్‌గా పిలుస్తారు. ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ఒక క్లిష్టమైన సిస్టమ్ లోపం. ఇది వచ్చిందంటే సిస్టమ్ తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటుందని, తక్షణం సొల్యూషన్ అవసరమని సూచిస్తున్నట్టు భావిస్తారు. ఏదైనా కొత్త హార్డ్‌వేర్ కారణంగా ఇది ఉత్పన్నమవుతుంది. సిస్టమ్ బీఎస్ఓడీని ఎదుర్కొన్నప్పుడు విండోస్ సిస్టమ్ మెషీన్‌కు ఎక్కువ నష్టం జరగకుండా అన్ని కార్యకలాపాలను ఆపివేస్తుంది. ఉదాహరణకు ర్యామ్, హార్డ్‌డ్రైవ్, ఎలక్ట్రిక్ సర్క్యూట్, గ్రీఫిక్ కార్డు లాంటి వాటి వల్ల ఈ ఎర్రర్ వస్తుంది.

బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎలా ఉంటుంది..

విండోస్ సిస్టమ్ బీఎస్ఓడీ ఎదురైనప్పుడు సిస్టమ్ మెయిన్ స్క్రీన్ ఆగిపోతుంది. డిస్‌ప్లే మీద ఎర్రర్ గురించి వివరించే బ్లూ స్క్రీన్‌ కనిపిస్తుంది. 'మీ కంప్యూటర్‌ను రక్షించేందుకు విండోస్ మూసివేస్తున్నాము' అని అందులో ఉంటుంది.

ప్రస్తుత బీఎస్‌డీకి కారణమేంటి..

ప్రస్తుతం, విండోస్ 10 సిస్టమ్‌లు బీఎస్ఓడీని ఎదుర్కోవడానికి కారణం క్రౌడ్ స్ట్రైక్ కంపెనీకి చెందిన ఫాల్కన్ సెన్సార్ అనే సైబర్‌ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌కు వచ్చిన అప్‌డేట్. ఈ అప్‌డేట్ కంప్యూటర్‌లలో సైబర్‌ సెక్యూరిటీ డిఫెన్స్‌తో వ్యవహరించే ఫాల్కన్ సూట్ సాఫ్ట్‌వేర్‌లో భాగం.

ప్రాబ్లమ్ సొల్యూషన్..

బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ పరిష్కారం కోసం మైకోసాఫ్ట్ వద్ద కూడా సరైన మార్గదర్శకాలు లేవు. ఈ ఎర్రర్ చాలా వ్యవస్థల్లో ఏర్పడటంతో కొందరు సిస్టమ్‌ను రీస్టార్ట్ చేయడం ద్వారా పరిష్కారం అయింది. అయితే ఈ ఎర్రర్ వచ్చినప్పుడు రీస్టార్ట్ కాకుండా మరే ఇతర మార్గాల్లోనూ ప్రయత్నం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై క్రౌడ్ స్ట్రైక్ కంపెనీ పనిచేస్తోంది. వీలైనంత త్వరగా పరిష్కారం కనుగొననున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. 

Tags:    

Similar News