EV car: పదిన్నర నిమిషాల్లో చార్జ్ అయ్యే కారు రెడీ

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం విపరీతంగా పెరిగింది

Update: 2024-08-14 12:29 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం విపరీతంగా పెరిగింది. అయితే వీటిలో ప్రధానంగా బ్యాటరీ చార్జింగ్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో దానికి పరిష్కారంగా వేగవంతమైన చార్జింగ్ సౌకర్యాన్ని కంపెనీలు అభివృద్ధి చేస్తున్నాయి. తాజాగా చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ Zeekr ప్రపంచంలోనే అత్యంత వేగంగా రీచార్జ్ అయ్యే బ్యాటరీని అందుబాటులోకి తెచ్చింది. ఇది కేవలం పదిన్నర నిమిషాల్లో 10 శాతం నుండి 80 శాతం సామర్థ్యంతో చార్జ్ కాగలదు. ఇప్పటి వరకు ఎలాన్ మస్క్‌కు చెందినటువంటి టెస్లా మోడల్ 3 కార్లు 15 నిమిషాల చార్జ్‌తో 282 కి.మీ వరకు ప్రయాణించవచ్చు.

ఇప్పుడు చైనా సంస్థ అభివృద్ధి చేసిన బ్యాటరీ చాలా శక్తివంతమైనదని కంపెనీ పేర్కొంది. మైనస్‌ 10 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలోనూ తమ బ్యాటరీలు సాధారణంగా పనిచేస్తాయని తెలిపింది. ఇదిలా ఉండగా, 2025 Zeekr 007 సెడాన్‌లో ఈ కొత్త బ్యాటరీని అమర్చారు. ఈ కారు వచ్చే వారం నుంచి అందుబాటులో ఉంటుంది. Zeekr అభివృద్ధి చేసిన బ్యాటరీలతో, ఈ పరిశ్రమలో అగ్రగామి అయిన టెస్లా, BYDతో సహా దాని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చినట్లయింది. Zeekr సంస్థ యూకే ఆధారిత లగ్జరీ స్పోర్ట్స్ కార్ బ్రాండ్ లోటస్, స్వీడన్‌కు చెందిన వోల్వోతో సహా అనేక బ్రాండ్‌లను కలిగి ఉంది. ప్రస్తుతం Zeekrకు చైనాలో 500 అల్ట్రా ఫాస్ట్‌ చార్జింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. వీటిని మరింత విస్తరించాలని చూస్తున్నారు.

Tags:    

Similar News