భారత్-చైనా మధ్య విమాన సర్వీసులను ప్రారంభించాలని చైనా అభ్యర్థన

నాలుగు సంవత్సరాలుగా భారత్-చైనా మధ్య నిలిచిపోయిన ప్యాసింజర్ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించాలని బీజింగ్ అధికారులు భారత్‌పై ఒత్తిడి తెస్తున్నారు.

Update: 2024-06-20 09:18 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: నాలుగు సంవత్సరాలుగా భారత్-చైనా మధ్య నిలిచిపోయిన ప్యాసింజర్ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించాలని బీజింగ్ అధికారులు భారత్‌పై ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఈ విషయంలో భారత్ స్పందించడం లేదని చైనా పేర్కొంటుంది. కరోనా నేపథ్యంలో నాలుగేళ్ల నుంచి భారత్‌, చైనా మధ్య విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఇరుదేశాల మధ్య నేరుగా విమానాలు లేకపోవడంతో హాంకాంగ్‌, శ్రీలంక, నేపాల్‌, మయన్మార్‌ గుండా చైనాకు వెళ్తున్నారు. ప్రయాణికుల విమానాలు నడవనప్పటికి, రెండు దేశాల మధ్య వాణిజ్యానికి సంబంధించిన ప్రత్యక్ష కార్గో విమానాలు మాత్రం ఇప్పటికీ నడుస్తున్నాయి.

జూన్ 2020లో వివాదాస్పద హిమాలయ సరిహద్దులో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయులు, కనీసం నలుగురు చైనా సైనికులు మరణించినప్పటి నుండి భారతదేశం-చైనా సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి. దాంతో నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించడానికి భారత్ ఆసక్తి చూపించడం లేదు. ఘర్షణ జరిగినప్పటి నుండి, భారతదేశం చైనా కంపెనీలకు ఇక్కడ నిబంధనలను కఠినతరం చేసింది. పెట్టుబడి పెట్టడం కష్టతరం చేసింది, వందలాది ప్రసిద్ధ యాప్‌లను నిషేధించింది. గత ఏడాది చైనా ప్రభుత్వం, అక్కడి విమానయాన సంస్థలు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించడానికి భారతదేశ పౌర విమానయాన అధికారులను కోరగా, వారు ఎలాంటి స్పందన ఇవ్వలేదు.

రెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాల పునరుద్ధరణ కోసం భారతదేశం అదే దిశలో చైనాతో కలిసి పనిచేస్తుందని మేము ఆశిస్తున్నాము అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ గత వారం రాయిటర్స్‌తో అన్నారు. విమానాలను తిరిగి ప్రారంభించడం ద్వారా రెండు దేశాలకు ప్రయోజనాలు ఉంటాయని చైనా అధికారులు పేర్కొన్నారు. అయితే భారత్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ, సరిహద్దులో శాంతి, ప్రశాంతత ఉంటే తప్ప చైనాతో ద్వైపాక్షిక చర్చలు ముందుకు సాగవని అన్నారు.


Similar News