Insurance: ‘పెరుగుతున్న క్లెయిమ్‌లతో ఆరోగ్య బీమా రంగానికి సవాళ్లు’

ప్రస్తుతం బీమా పాలసీలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో తిరిగి చెల్లింపుల సమయంలో సంస్థలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయని జెఫరీస్ నివేదిక వెల్లడించింది.

Update: 2024-08-24 10:01 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం బీమా పాలసీలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో తిరిగి చెల్లింపుల సమయంలో సంస్థలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయని జెఫరీస్ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా రిటైల్ రంగంలో పెరుగుతున్న క్లెయిమ్‌లు, పోటీ కారణంగా ఆరోగ్య బీమా రంగం రాబోయే నెలల్లో సవాళ్లను ఎదుర్కొంటుందని నివేదిక హైలైట్ చేసింది. కరోనా తర్వాత కాలంలో బీమా రంగంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరగడం, ఎక్కువ మంది వినియోగదారులు బీమాను క్లెయిమ్ చేయడంతో దేశంలోని నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ రంగం గణనీయమైన మార్పులను ఎదుర్కొంటోంది. ఇది పోటీతత్వంలో ఉంటూనే ఖర్చులను నిర్వహించేందుకు బీమా సంస్థలపై ఒత్తిడి తెచ్చిపెడుతుందని జెఫరీస్ పేర్కొంది.

ఇదే సమయంలో మోటారు బీమా రంగం మాత్రం ఆశాజనకంగా ఉందని నివేదిక తెలిపింది. ఈ విభాగం పెద్ద ప్రైవేటు బీమా సంస్థలకు ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా వేసింది. భారతదేశంలో మోటారు బీమా విభాగం 2024 నుండి 2027 ఆర్థిక సంవత్సరాల్లో 14 శాతం వార్షిక వృద్ధి రేటు సాధించే అవకాశం ఉందని, ఈ వృద్ధి వెనుక ఉన్న ప్రధాన కారణం ఆటోమొబైల్ మార్కెట్‌లో అధిక-విలువ వాహనాల వైపు వినియోగదారులు ఆసక్తి కలిగి ఉండటంతో ఇది సాధ్యమవుతుందని జెఫరీస్ నివేదిక పేర్కొంది. భారతదేశంలోని విస్తృత నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెట్ గణనీయంగా తక్కువగా ఉందని, బీమా ప్రీమియంలు దేశ GDPలో 1 శాతం మాత్రమే ఉన్నాయని నివేదిక పేర్కొంది.


Similar News