బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరట.. ఆదాయపు పన్ను తగ్గింపుకు చాన్స్..!

మూడోసారి ప్రధాని మోడీ అధికారంలోకి రావడంతో జులైలో పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు

Update: 2024-06-21 10:25 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: మూడోసారి ప్రధాని మోడీ అధికారంలోకి రావడంతో జులైలో పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే బడ్జెట్‌లో తక్కువ ఆదాయం గల వ్యక్తులకు పన్ను తగ్గించేలా నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి 5 నుంచి 20 శాతం మధ్య పన్ను విధిస్తుండగా, వాటిలో మార్పులు తేవాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త పన్ను శ్లాబ్‌‌ల గురించి ప్రస్తుతం ఆర్థిక శాఖ చర్చలు జరుపుతుందని సంబంధిత వర్గాల వారు తెలిపారు.

పన్ను రేట్లను తగ్గించడం ద్వారా వినియోగం పెరిగి జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతుందని కేంద్రం భావిస్తోంది. దాదాపు(రూ.50 వేల కోట్ల) 6 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన వినియోగాన్ని పెంచే చర్యలను పరిశీలిస్తున్నారు. అలాగే, రాబోయే బడ్జెట్ వేతన జీవులకు మాత్రమే కాకుండా ఇతర వర్గాలకు సైతం మేలు కలిగేలా పలు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కనీస ఉపాధి హామీ పథకం కింద వార్షిక చెల్లింపును పెంచడం, మహిళా రైతులకు ఆర్థిక సహాయాన్ని విస్తృతం చేయడంపై కూడా చర్చలు జరుగుతున్నాయని వారు తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వారం నుంచి ఆర్థికవేత్తలు, ట్రేడ్ యూనియన్లు, పరిశ్రమల ఛాంబర్‌లతో సహా వాటాదారులతో ముందస్తు-బడ్జెట్ సంప్రదింపులు జరుపుతున్నారు.


Similar News