Industrial parks: 12 కొత్త స్మార్ట్ పారిశ్రామిక నగరాలకు కేబినెట్ ఆమోదం
దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కోట్లాది రూపాయల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి కేంద్రం సిద్ధమైంది
దిశ, బిజినెస్ బ్యూరో: దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కోట్లాది రూపాయల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి కేంద్రం సిద్ధమైంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా తయారీని పెంచడానికి, ఉపాధి అవకాశాలను కల్పించడానికి నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద రూ. 28,602 కోట్ల అంచనా పెట్టుబడితో 12 కొత్త స్మార్ట్ పారిశ్రామిక నగరాలను ఏర్పాటు చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టులు 10 రాష్ట్రాలలో విస్తరించగా, ఆరు ప్రధాన కారిడార్‌లను వ్యూహాత్మకంగా అభివృద్ధి చేస్తారు.
ఈ పారిశ్రామిక ప్రాంతాలను ఉత్తరాఖండ్‌లోని ఖుర్పియా, పంజాబ్‌లోని రాజ్‌పురా-పాటియాలా, మహారాష్ట్రలోని డిఘి, కేరళలోని పాలక్కాడ్, యూపీలోని ఆగ్రా, ప్రయాగ్‌రాజ్, బీహార్‌లోని గయా, తెలంగాణలోని జహీరాబాద్, ఏపీలోని ఓర్వకల్, కొప్పర్తి, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్-పాలిలో ఏర్పాటు చేస్తారు. వీటిని గ్లోబల్ స్టాండర్డ్స్‌లో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు దాదాపు రూ.1.52 లక్షల కోట్ల పెట్టుబడి సామర్థ్యాన్ని సృష్టిస్తాయని అధికారులు తెలిపారు. అలాగే దాదాపు 10 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు, 30 లక్షల వరకు పరోక్ష ఉద్యోగాలను కూడా వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఫుడ్ ప్రాసెసింగ్, స్పెషలైజ్డ్ టెక్స్‌టైల్స్, లాజిస్టిక్స్, టూరిజం, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి రంగాలకు ప్రోత్సాహం అందిస్తారు. ఈ పరిశ్రమల ద్వారా 2030 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించడానికి అవకాశం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. ఇటీవల 2024–25 సంవత్సరానికి బడ్జెట్‌ను సమర్పిస్తున్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద 12 ఇండస్ట్రియల్ పార్కులను మంజూరు చేస్తామని అన్నారు. ఇప్పుడు దానికి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది.