బడ్జెట్-2024లో పన్నుల భారం తగ్గించే చర్యలు ఆశిస్తున్న వాహన పరిశ్రమ
మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించే విధానాలను కొనసాగించాలని కోరుతోంది.
దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వారంలో కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్ కావడంతో వివిధ రంగాల నుంచి వినతులు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే ఆటోమొబైల్ రంగం సైతం, మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించే విధానాలను కొనసాగించాలని కోరుతోంది. 'మునుపటి లాగే వాహన రంగానికి ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నాం. ముఖ్యంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై వ్యయం కొనసాగుతుందని భావిస్తున్నాం. గ్రీన్ మొబిలిటీకి పాలసీ పరమైన మద్దతు, ఈవీలు మరింత వేగంగా మార్కెట్లో విస్తరించేందుకు తగిన ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి లభిస్తుందని' మెర్సిడెస్ బెంజ్ ఇండియా సీఈఓ, ఎండీ సంతోష్ అయ్యర్ అన్నారు. లగ్జరీ వాహనాల్లో ప్రస్తుతం సెడాన్‌లపై 20 శాతం, ఎస్‌యూవీలపై 22 శాతం, అదనపు సెస్‌తో కలిపి 28 శాతం జీఎస్టీని చెల్లిస్తున్నాయి. మొత్తంగా లగ్జరీ వాహనాలపై 50 శాతం వరకు పన్నులు ఉన్నాయి. దీన్ని తగ్గించే చర్యలు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
సంప్రదాయ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ, గ్రీన్ ఎనర్జీకి ఆర్థికవ్యవస్థ, రవాణా రంగాన్ని మార్చడానికి ప్రభుత్వం నుంచి ప్రయత్నాలు మరింత పెరుగుతాయనే నమ్మకం ఉందని టయోటా కిర్లోస్కర్‌కు చెందిన స్వప్నేష్ ఆర్ మారు పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్) రెండు దశలు పూర్తయ్యాయి. దీనికి కొనసాగింపుగా ఫేమ్-3ని కొనసాగించడం ద్వారా ప్రత్యామ్నయ ఇంధనం వైపు ప్రజలను మళ్లించవచ్చని మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ సీఈఓ, ఎండీ సుమన్ మిశ్రా వెల్లడించారు.