సరికొత్త 'ఎక్స్ సిరీస్' కారును విడుదల చేసిన బీఎండబ్ల్యూ!
లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ తన సరికొత్త ఎక్స్ సిరీస్ మోడల్ కారును గురువారం మార్కెట్లో విడుదల చేసింది.
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ తన సరికొత్త ఎక్స్ సిరీస్ మోడల్ కారును గురువారం మార్కెట్లో విడుదల చేసింది. బీఎండబ్ల్యూ ఎక్స్1 ఎస్‌డ్రైవ్ 18ఐ ఎం స్పోర్ట్ పేరుతో తీసుకొచ్చిన కారు ధరను రూ. 48.90 లక్షలుగా నిర్ణయించినట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. చెన్నైలోని కంపెనీ ప్లాంటులో తయారైన ఎక్స్1 మోడల్ కారు డెలివరీలను జూన్ నుంచి ప్రారంభించనున్నారు. అత్యాధునిక ఫీచర్లతో, 7-స్పీడ్ డ్యూయెల్ క్లచ్ గేర్ ట్రాన్స్‌మిషన్ కలిగిన ఈ కారు కేవలం 9.2 సెకన్లలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
వినియోగదారుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని లగ్జరీ ఫీచర్లు ఇందులో అందించామని, సిటీ డ్రైవ్, ఆఫ్‌రోడ్ రైడింగ్ ఇష్టపడే వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా ఉంటుందని బీఎండబ్ల్యూ ఇండియా అధ్యక్షుడు విక్రమ్ పవా చెప్పారు. కారు రివర్స్, పార్కింగ్ చేసే సమయంలో సమస్యలు ఉత్పన్నం కాకుండా అత్యాధునిక డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్‌తో పాటు ప్రయాణీకుల భద్రతకు అవసరమైన అన్ని రకాల సేఫ్టీ ఫీచర్లు అందించామని విక్రమ్ పేర్కొన్నారు.