Ola Electric IPO: ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓతో అపరకుబేరుల జాబితాలోకి భవీశ్ అగర్వాల్
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సంస్థ ఓలా ఎలక్ట్రిక్ శుక్రవారం స్టాక్‌మార్కెట్లో లిస్ట్ అయింది.
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సంస్థ ఓలా ఎలక్ట్రిక్ శుక్రవారం స్టాక్‌మార్కెట్లో లిస్ట్ అయింది. ఇష్యూ ధర రూ.76 కాగా, ప్లాట్‌గా లిస్ట్ అయి మార్కెట్ ముగిసే సమయానికి రూ.91.20 దగ్గర గరిష్ట స్థాయిని తాకింది. ఇదిలా ఉంటే అరంగేట్రంలో షేర్లు 20 శాతం పెరగడంతో కంపెనీ విలువ $4.8 బిలియన్లకు చేరుకుంది. అలాగే వ్యక్తిగతంగా ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు, సీఈఓ భవీశ్ అగర్వాల్ సంపద 1.4 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ఇండియా నుంచి అంబానీ, అదానీ వంటి ధనవంతులు ఉన్నటువంటి బిలియనీర్ల జాబితాలోకి భవీశ్ అడుగుపెట్టారు. 2024లో ఓలా ఎలక్ట్రిక్ $734 మిలియన్ల ఐపీఓ ఇప్పటివరకు భారతదేశంలోనే అతిపెద్దది.
ఈవీ వాహనాల వాడకం విపరీతంగా పెరగడంతో కంపెనీ వృద్ధి ఆశాజనకంగా ఉంది. ఇటీవల కాలంలో మార్కెట్లో ఉన్న ఒత్తిడి నేపథ్యంలో లిస్టింగ్ ప్లాట్‌గా ఉన్నప్పటికి తరువాత రోజుల్లో షేర్ ధరలు క్రమంగా పెరుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. జులై నాటికి 39 శాతం మార్కెట్ వాటాతో, ఓలా ఎలక్ట్రిక్ భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలలో ఆధిపత్యం చెలాయిస్తుంది. ఇదిలా ఉంటే మార్కెట్లో లిస్టింగ్ సందర్భంగా శుక్రవారం ఉదయం ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో జరిగిన ఓలా ఎలక్ట్రిక్ లిస్టింగ్ వేడుకలో భవిష్ అగర్వాల్ భార్య రాజలక్ష్మి అగర్వాల్‌తో కలిసి పాల్గొన్నారు.