సంపన్నుల జాబితాలో అగ్రస్థానాన్ని కోల్పోయిన Elon Musk.. దూసుకొచ్చిన Adani
ఇటీవల వరుసగా వార్తల్లో నిలుస్తున్న ప్రపంచ అత్యంత సంపన్నుడు అయిన ఎలాన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది.
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల వరుసగా వార్తల్లో నిలుస్తున్న ప్రపంచ అత్యంత సంపన్నుడు అయిన ఎలాన్ మస్క్‌కు భారీ షాక్ తగిలింది. ఈ మధ్య కాలంలో ఆయన షేర్లు క్రమంగా పడిపోతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుండి మస్క్ సంపద $100 బిలియన్లకు పడిపోయినట్లు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తెలిపింది. ఇది భారత కరెన్సీలో అక్షరాల రూ. 8.4 లక్షల కోట్లు.
ప్రస్తుతం ఎలాన్ మస్క్ సంపద 168.5 బిలియన్ డాలర్లుగా ఉంది. గత నెలల్లో మస్క్ ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కొనుగోలు కోసం మస్క్ టెస్లా షేర్లను అమ్మారు. ఇది కూడా ఆయన సంపద తగ్గడానికి ఒక కారణం. మస్క్ సంపదలో సింహ భాగం టెస్లా ద్వారా వస్తుంది.
ప్రస్తుతం ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో ఫ్యాషన్ దిగ్గజం LVMH చైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఉన్నారు. ఈయన సంపద 172.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈయన ఫ్రెంచ్‌కు చెందిన వ్యాపారవేత్త. LVMH కంపెనీ విలాసవంతమైన వస్తువులకు పేరుగాంచింది. 70 రకాల ఫ్యాషన్ బ్రాండ్లను కలిగి ఉంది.
సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో భారత దిగ్గజ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ నిలిచారు. ఈయన సంపద 134.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇటీవల కాలంలో అదానీ భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. గౌతమ్ అదానీ త్వరలో ఇతరులకు గట్టి పోటీ నిస్తూ సంపన్నుల జాబితాలో మొదటి స్థానానికి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.