సరికొత్త ప్రీమియం చేతక్ ఈవీని తీసుకొచ్చిన బజాజ్ ఆటో!
దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం బజాజ్ ఆటో తన చేతక్ మోడల్ ప్రీమియం ఈవీ స్కూటర్‌ను గురువారం విడుదల చేసింది.
న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం బజాజ్ ఆటో తన చేతక్ మోడల్ ప్రీమియం ఈవీ స్కూటర్‌ను గురువారం విడుదల చేసింది. 2023 ఎడిషన్‌గా తీసుకొచ్చిన ఈ స్కూటర్‌లో డిజైన్ పరంగా కూడా మార్పులు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ కొత్త ప్రీమియం స్కూటర్ ధరను రూ. 1.52 లక్షలుగా నిర్ణయించినట్టు బజాజ్ ఆటో తెలిపింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న చేతక్ ఈవీ రూ. 1.22 లక్షల ధరలో లభిస్తోంది.
వినియోగదారులకు రెండు వేరియంట్లూ అందుబాటులో ఉంటాయని, కొత్త స్కూటర్ కోసం బుకింగ్స్ మొదలవగా, ఏప్రిల్ నుంచి డెలివరీలు అందించనున్నట్టు పేర్కొంది. పూర్తి అత్యాధునిక ఫీచర్లతో పాటు ప్రీమియం పరికరాలతో కొత్త చేతక్ ఈవీని రూపొందించారు. బ్లూ, గ్రే, బ్లాక్ కలర్లలో ఇది అందుబాటులో ఉంది. కొత్తగా చేసిన మార్పులో ప్రధానంగా వాహన సమాచారాన్ని కలిగి ఉండే మెరుగైన ఎల్‌సీడీ డిస్‌ప్లే అందించామని కంపెనీ వెల్లడించింది.
ఇది కాకుండా ప్రీమియం డబుల్ టోన్‌డ్ సీట్, నాణ్యమైన ఫుట్‌రెస్ట్, వ్యూ మిర్రర్స్ ఉన్నాయి. ఒకసారి ఛార్జింగ్ చేసిన తర్వాత ఈ స్కూటర్ 90 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కొత్తగా చేసిన మార్పులతో చేతక్ ప్రీమియం ఈవీ ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో గేమ్ ఛేంజర్ అవుతుందని కంపెనీ పేర్కొంది.