ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్ విడుదల

2 కిలోల సీఎన్‌జీ, 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్‌తో ఈ బైక్ డ్యూయల్ టోన్ కలర్‌తో ఏడు రంగుల్లో మార్కెట్లో లభిస్తుంది.

Update: 2024-07-05 11:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: టూ-వీలర్ రంగంలో సరికొత్త సంచలనంగా ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైకును శుక్రవారం విడుదల చేసింది. ఫ్రీడమ్125 పేరుతో తీసుకొచ్చిన ఈ బైకు ఆవిష్కరణ కార్యక్రమానికి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా హాజరయ్యారు. సీఎన్‌జీతో పాటు పెట్రోల్ వేరియంట్‌తో కూడిన ట్విన్ ట్యాంక్ కలిగిన ఈ బైక్ మైలేజీ పరంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ వెల్లడించింది. 2 కిలోల సీఎన్‌జీ, 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్‌తో మూడు వేరియంట్లలో విడుదల చేసిన ఈ బైక్ డ్యూయల్ టోన్ కలర్‌తో ఏడు రంగుల్లో మార్కెట్లో లభిస్తుంది. డ్రమ్ వేరియంట్ రూ. 95 వేలకే లభిస్తుండగా, డ్రమ్ ఎల్ఈడీ రూ. 1.05 లక్షలు, డిస్క్ ఎల్ఈడీ వేరియంట్ రూ. 1.10 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. పెట్రోల్ బైకులతో పోలిస్తే ధర తక్కువగా ఉన్నందున ఈ బైక్ కోసం మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉండవచ్చనే నమ్మకం ఉందని నితిన్ గడ్కరీ అన్నారు. పెట్రోల్ వేరియంట్ కిలోమీటర్‌కు రూ. 2.25, సీఎన్‌జీ కిలోమీటర్‌కు రూ. 1 మాత్రమే ఖర్చు కావడం మంచి విషయమని ఆయన పేర్కొన్నారు. తక్కువ ధరే అయినప్పటికీ అత్యాధునిక ఫీచర్లు ఇందులో అమర్చామని కంపెనీ వెల్లడించింది. 


Similar News