India Post: దేశవ్యాప్తంగా డెలివరీల కోసం అమెజాన్, ఇండియా పోస్ట్ ఒప్పందం
లాజిస్టిక్ నెట్‌వర్క్‌ను మెరుగుపరచడం, వనరుల వినియోగాన్ని పెంచడం ద్వారా డెలివరీ సేవలు సులభమవుతాయని అమెజాన్ వెల్లడించింది.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా డెలివరీ సేవలను అందించేందుకు ఇండియా పోస్ట్‌తో అమెజాన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్ కీలక ఒప్పందం చేసుకుంది. డెలివరీ సామర్థ్యాలను పెంచేందుకు ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుందని ఇరు సంస్థలు ప్రకటించాయి. దీనికి సంబంధించి శుక్రవారం ఇరు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. లాజిస్టిక్ నెట్‌వర్క్‌ను మెరుగుపరచడం, వనరుల వినియోగాన్ని పెంచడం ద్వారా డెలివరీ సేవలు మరింత సులభంగా ఉంటాయని అమెజాన్ వెల్లడించింది. ఇండియా పోస్ట్‌కు దేశంలో 1.65 లక్షల పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ సేవలను కొత్త టెక్నాలజీ ద్వారా ఆధునీకరించనున్నాం. దీనివల్ల డిజిటల్ వినియోగంలో ఉన్న అంతరాన్ని తగ్గించి, ఈ-కామర్స్ సేవలను అందరికీ చేరువ చేసేందుకు అమెజాన్‌తో భాగస్వామ్యం ఉపయోగపడుతుందని ఇండియా పోస్ట్ కార్యదర్శి వందిత కౌల్ చెప్పారు. దశాబ్దాల నుంచి భారత్‌లో సేవలందిస్తున్న అమెజాన్‌తో చేతులు కలపడం ద్వారా కస్టమర్ సర్వీస్, లాజిస్టిక్స్ విభాగంలో కొత్త ఒరవడికి అవకాశాలు పెరుగుతున్నాయని వందిత కౌల్ పేర్కొన్నారు.