కొత్త ఎక్స్ఛేంజ్ పథకాన్ని ప్రకటించిన ఏథర్ ఎనర్జీ

ఇప్పటికే ఏథర్ ఎనర్జీ స్కూటర్లకు కలిగి ఉన్న వినియోగదారులు 450ఎక్స్ లేదా 450 అపెక్స్‌లకు అప్‌గ్రేడ్ కావడానికి..

Update: 2024-03-21 13:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ ఏథర్ ఎనర్జీ కొత్త ఎక్స్ఛేంజ్ పథకాన్ని ప్రకటించింది. ఇప్పటికే ఏథర్ ఎనర్జీ స్కూటర్లకు కలిగి ఉన్న వినియోగదారులు 450ఎక్స్ లేదా 450 అపెక్స్‌లకు అప్‌గ్రేడ్ కావడానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. మొదట జనవరిలోనే కంపెనీ పైలట్ ప్రాజెక్టుగా ఏథర్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ఆ సమయంలో ఇది ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే తీసుకొచ్చింది. తాజాగా దీన్ని ఏథర్ బేస్ మోడల్ స్కూటర్ ఉన్న అందరికీ వర్తిస్తుందని వెల్లడించింది. ఏథర్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ కింద బేస్ మోడల్ స్కూటర్ కలిగిన వినియోగదారులు 450ఎక్స్ మోడల్‌కు అప్‌గ్రేడ్ కావడానికి మార్చి 31 వరకు గడువు ఉంటుంది. దీనికోసం కస్టమర్లు తప్పనిసరిగా ఏథర్ 450 జెన్ 1, జెన్ 1.5 కొనుగోలు, ఇన్‌వాయిస్, రిజిస్ట్రేషన్‌ను మార్చి 31లోగా పూర్తి చేసి ఉండాలి. అదే విధంగా 450అపెక్స్ కావాలనుకునే వారికి ఈ ప్రక్రియ ఏప్రిల్ 30లోపు చేయాల్సి ఉంటుంది. పాత స్కూటర్‌ను అప్పగించడంతో పాటు లావాదేవీ కూడా అదే రోజు పూర్తవుతుందని కంపెనీ తెలిపింది. ఎక్స్‌ఛేంజ్ కోసం కస్టమర్లు తమ పాత స్కూటర్‌ను బెంగళూరులోని ఏథర్ స్పేస్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. శిక్షణ పొందిన కంపెనీ సిబ్బంది స్కూటర్‌ను పరిశీలించిన తర్వాత ఏవైనా పెండింగ్ ట్రాఫిక్ చలానాలు, ఇతర అంశాలను సమీక్షిస్తారు. కంపెనీ వివరాల ప్రకారం, 36 నెలల కంటే పాత స్కూటర్ల అప్‌గ్రేడ్ చేసుకుంటే కొత్త ఏథర్ 450 మోడళ్లు సుమారు రూ. 80 వేల నుంచి రూ. 1.30 లక్షల ధరల్లో లభిస్తాయి. వేరియంట్, అదనపు ఫీచర్లను బట్టి ధర మారవచ్చు. 

Tags:    

Similar News