ఉద్యోగుల కోసం 78,000 ఇళ్లు నిర్మించనున్న యాపిల్

ఉద్యోగులకు మెరుగైన జీవన ఏర్పాట్లు కల్పించడంపై దృష్టి సారించింది.

Update: 2024-04-09 11:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ తన ఉద్యోగుల శ్రేయస్సు కోసం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో కంపెనీకి చెందిన ఫ్యాక్టరీల్లోని ఉద్యోగుల కోసం 78,000కు పైగా ఇళ్లను నిర్మించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. గత రెండున్నరేళ్లలో దేశీయంగా ఉద్యోగాల కల్పనలో ఆపిల్ కీలక పాత్ర పోషించింది. 1,50,000 కంటే ఎక్కువ ప్రత్యక్ష ఉద్యోగాలు అందించింది. తాజాగా ఈ ఉద్యోగులకు మెరుగైన జీవన ఏర్పాట్లు కల్పించడంపై దృష్టి సారించింది. వారందరికీ సమర్థత, భద్రత, మొత్తం సంక్షేమానికి భరోసా కల్పించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కంపెనీకి చెందిన అతిపెద్ద ఐఫోన్ తయారీ ప్లాంటు ఉన్న తమిళనాడు రాష్ట్రంలో అత్యధికంగా(58 వేలు) ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనుంది. మహిళా ఉద్యోగులతో పాటు అందరికీ మెరుగైన నివాస సౌకర్యాన్ని కల్పించాలని కంపెనీ భావిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇళ్ల నిర్మాణం జరగనుంది. ప్రైవేట్ రంగంలో ఈ తరహాలో ఉద్యోగులకు భారీగా ఇళ్లను నిర్మించడం ఇదే తొలిసారి అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 2025, మార్చి 31 నాటికి ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని కంపెనీ ప్రణాళికను నిర్దేశించింది. ప్రధానంగా ఈ ఇళ్లు కంపెనీలో పనిచేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మహిళల కోసమని సమాచారం. ప్రస్తుతం, చాలామంది పని చేసేందుకు ఇంటి నుంచి దూరంగా అద్దెకు ఉండి, ఎక్కువ ప్రయాణిస్తున్నారు. 

Tags:    

Similar News