iPhones: ఐఫోన్లపై బంపర్ ఆఫర్ ఇచ్చిన కంపెనీ.. భారీగా ధరల తగ్గింపు
ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి యాపిల్ కంపెనీ భారీ శుభవార్త చెప్పింది. తన అన్ని ప్రో మోడల్స్ ధరలను తగ్గించింది
దిశ, బిజినెస్ బ్యూరో: ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి యాపిల్ కంపెనీ భారీ శుభవార్త చెప్పింది. తన అన్ని ప్రో మోడల్స్ ధరలను తగ్గించింది. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో మొబైల్ ఫోన్‌లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 20 శాతం నుండి 15 శాతానికి తగ్గించిన నేపథ్యంలో యాపిల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రయోజనాలను వినియోగదారులకు అందించడానికి తన ఐఫోన్ల ధరలను దాదాపు 3 నుంచి 4 శాతం తగ్గించింది. ప్రస్తుతం iPhone Pro మోడల్ ధర రూ.5,100, Pro Max ధర రూ.6,000 తగ్గింది. ఇంకా iPhone 13, 14, 15 మోడళ్ల ధరలు రూ.300 తగ్గింది. SE మోడల్ రూ.2300 తగ్గింది. యాపిల్ తన ప్రో మోడల్స్ ధరలను తగ్గించడం ఇదే మొదటిసారి. కంపెనీ సాధారణంగా కొత్త ప్రో మోడల్స్‌ను మార్కెట్లో లాంచ్ చేసినప్పుడు పాత వాటి ధరలను తగ్గిస్తుంది. అయితే ఇప్పుడు కస్టమ్స్ డ్యూటీ తగ్గడంతో తన ఫోన్ల ధరలను తగ్గించింది.
సాధారణంగా భారతదేశంలోకి దిగుమతి చేసుకునే స్మార్ట్‌ఫోన్‌లకు 18 శాతం GST, 22 శాతం కస్టమ్స్ డ్యూటీ ఉంటాయి. అయితే బడ్జెట్ ప్రకటనలో కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు తర్వాత మొత్తం 16.5 శాతానికి చేరింది. దీనికి 18 శాతం జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. యాపిల్ కంపెనీ భారతదేశంలో విక్రయిస్తున్న 99 శాతం మొబైల్ ఫోన్‌లు స్థానికంగా తయారవుతున్నాయి. 13, 14, 15 బేసిక్ మోడళ్లను దేశీయంగా తయారు చేస్తుండగా, ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లను మాత్రం దిగుమతి చేస్తోంది.