దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత మార్కెట్లో ప్రవేశం వివిధ కారణాలతో ఆలస్యమవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల టెస్లా అధినేత ఎలన్ మస్క్ ప్రభుత్వంతో సవాళ్లు ఉన్నందున ఆలస్యమవుతోందన్నారు. దానికి ప్రభుత్వం సైతం బదులిచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల పలు రాష్ట్రాల నుంచి టెస్లా తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆహ్వానాలు పెరుగుతున్నాయి. మొదటగా గత వారాంతం తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా టెస్లా భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తే కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇప్పటికే అనేక గ్లోబల్ కంపెనీలు తెలంగాణలో ఇన్వెస్ట్ చేశాయన్నారు. తర్వాత ఎలన్ మస్క్‌ను ట్విటర్ ద్వారా ఇతర రాష్ట్రాల మంత్రులు సైతం మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానం పలుకుతున్నాయి. కేటీఆర్ తర్వాత మహారాష్ట్రకు చెందిన జలవనరుల మంత్రి జయంత్ పాటిల్ కూడా ట్విటర్ ద్వారా దేశీయ మెరుగైన అభివృద్ధిని సాధిస్తున్న మహారాష్ట్రలో కంపెనీ తయారీ ప్లాంట్‌కు సహకారం అందిస్తామని చెప్పారు. ఇక, ఆదివారం పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా టెస్లా కంపెనీని తమ రాష్ట్రానికి ఆహ్వానించారు. పంజాబ్‌లోని లూథియానాలో టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలకు, బ్యాటరీ పరిశ్రమకు కేంద్రంగా మారవచ్చని, పెట్టుబడులకు సింగిల్ విండో క్లియరెన్స్ అవకాశం కల్పిస్తామని చెప్పారు.