Anil Ambani: చిక్కుల్లో అనిల్ అంబానీ.. రిలయన్స్ పవర్‌పై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌కు నోటీసులు
నకిలీ బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చిన కారణంతో నిర్ణయం
దిశ, బిజినెస్ బ్యూరో: అనీల్ అంబానికి చెందిన రిలయన్స్ పవర్ కంపెనీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవలే రిలయన్స్ పవర్‌తో పాటు దాని అనుబంధ సంస్థలపై సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఈసీఐ) మూడేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. నకిలీ బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చిన కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, తాజాగా ఈ వ్యవహారంలో క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎందుకు ప్రారంభించకూడదంటూ రిలయన్స్ పవర్‌కు ఎస్ఈసీఐ నోటీసులు జారీ చేసింది. ఎస్ఈసీఐ సోలార్ పవర్, బ్యాటరీ ఎనర్జీ సోలార్ సిస్టమ్ కోసం ఆహ్వానించిన బిడ్లలో రిలయన్స్ పవర్‌కు చెందిన రిలయన్స్ ఎన్‌యూ బీఈఎస్ఎస్ పాల్గొంది. చివరి రౌండ్ బిడ్డింగ్‌లో నకిలీ గ్యారెంటీలు ఇచ్చినట్టు దర్యాప్తులో తేలిందని ఎస్ఈసీఐ పేర్కొంది. నకిలీ బ్యాక్ గ్యారెంటీలను పదే పదే సమర్పించడం బిడ్డర్ ఉద్దేశపూర్వక చర్యగా పరిగణిస్తున్నాం. ఇది టెండరింగ్ ప్రక్రియను దెబ్బతీయడంతో పాటు మోసపూరితంగా ప్రాజెక్ట్ వైఫల్యానికి ప్రయత్నించడమని వివరించింది. అయితే, ఎస్ఈసీఐ నిషేధంపై రిలయన్స్ పవర్ చట్టపరంగా దీన్ని సవాలు చేస్తామని, బ్యాంక్ గ్యారెంటీలు ఏర్పాటు చేసిన థర్డ్ పార్టీపై ఫిర్యాదు చేస్తామని వెల్లడించింది.