Reliance: శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్ వేలానికి పట్టుబడుతున్న రిలయన్స్
గతంలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్‌కు వేలం ఉండొద్దని స్టార్‌లింక్ కంపెనీ లాబీయింగ్ చేసినట్టు సమాచారం.
దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించి బిలీయనీర్ ముఖేష్ అంబానీ టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌తో ప్రైవేట్‌గా లాబీయింగ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో గతేడాది నుంచే ప్రపంచ బిలీయనీర్ ఎలన్ మస్క్‌తో అంబానీ పోటీ పడుతున్నారు. గతంలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్‌కు వేలం ఉండొద్దని స్టార్‌లింక్ కంపెనీ లాబీయింగ్ చేసినట్టు సమాచారం. అంతర్జాతీయంగా కేటాయించే లైసెన్స్ విధానాన్నే అనుసరించాలని కోరినట్టు తెలుస్తోంది. దీనిపై రిలయన్స్ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా దీనికి సంబంధించి ట్రాయ్ హోమ్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను వేలం లేకుండా కేటాయించాలని పొరపాటుగా నిర్ధారించిందని అభిప్రాయపడింది. మస్క్ ఆశించిన విధంగా స్పెక్ట్రమ్ కేటాయింపునకు మార్గం సుగమం అయిందని పరిశ్రమలో చర్చ జరుగుతోంది. అయితే, వ్యక్తిగత, ఇంటి వినియోగానికి శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు ఎలాంటి నిబంధనలు లేవని రిలయన్స్ వాధిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ట్రాయ్ పబ్లిక్ కన్సల్టేషన్ నిర్వహిస్తోంది. ఇటీవల రిలయన్స్ సంస్థ ట్రాయ్‌కు రాసిన లేఖలో ఈ ప్రక్రియను కొత్తగా ప్రారంభించాలని కోరింది. స్పెక్ట్రమ్ అసైన్‌మెంట్ అడ్మినిస్ట్రేటివ్‌గా ఉండాలని ట్రాయ్ ఎలాంటి ఆధారం లేకుండా నిర్ధారించినట్లుందని రిలయన్స్ సీనియర్ రెగ్యులేటరీ అఫైర్స్ ఆఫీసర్ కపూర్ సింగ్ గులియాని భారత టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.