Amazon India: అమెజాన్ ఇండియా కంట్రీ హెడ్ పదవికి రాజీనామా చేయనున్న మనీష్ తివారీ
ఈ ఏడాది అక్టోబర్‌లో తన పదవికి రాజీనామా చేయనున్నారు. దీనికి సంబంధించి కంపెనీ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
దిశ, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా విభాగం హెడ్ మనీశ్ తివారీ ఈ ఏడాది అక్టోబర్‌లో తన పదవికి రాజీనామా చేయనున్నారు. దీనికి సంబంధించి కంపెనీ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎనిమిదేళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మనీశ్ తివారీ కంపెనీ వృద్ధి సాధించడంలో, కార్యకలాపాల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. 2016లో అమెజాన్ బాధ్యతలు తీసుకున్న ఆయన అత్యంత పోటీ కలిగిన ఈ-కామర్స్ రంగంలో కంపెనీ విజయవంతంగా కొనసాగేందుకు దోహదపడ్డారు. అమెజాన్ ఇండియా వ్యాపార విజయంలో మనీశ్ తివారీ పనితీరు సంతృప్తిగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని అవకాశాల కోసం సంస్థను వీడుతున్నట్టు కంపెనీ వివరించింది. అమెజాన్ సంస్థ భారత్‌లో ప్రధానంగా క్లౌడ్ వ్యాపారంపై దృష్టి సారిస్తోంది. దేశీయ మార్కెట్లో 7 బిలియన్లకు(రూ. 58 వేల కోట్ల) పైగా పెట్టుబడి పెట్టిన అమెజాన్, దేశంలోని చిన్న నగరాలు, పట్టణాలలో తన ఉనికిని విస్తరించడంలో సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో తివారీ సంస్థ నుంచి వైదొలగుతుండటం గమనార్హం.