Amazon: అమ్మకపు ఫీజును 12% వరకు తగ్గించిన అమెజాన్

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా పండుగలకు ముందు కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-08-24 08:27 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా పండుగలకు ముందు కీలక నిర్ణయం తీసుకుంది. తన ప్లాట్‌ఫామ్‌లో విక్రయించే ఉత్పత్తులపై అమ్మకపు(విక్రయ) ఫీజును 12 శాతం వరకు తగ్గించింది. ఈ విషయాన్ని కంపెనీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఫీజు తగ్గింపు సెప్టెంబర్ 9 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నిర్ణయంతో ప్లాట్‌ఫారమ్‌లో తమ ఉత్పత్తులను విక్రయించే వ్యాపారులు మరింత తక్కువ ఫీజుతో అమ్మకాలు చేయడానికి అవకాశం ఉంటుందని అమెజాన్ ఇండియా అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కేటగిరీని బట్టి వివిధ ఉత్పత్తులపై 3-12 శాతం వరకు అమ్మకపు రుసుము తగ్గింపు నుండి ప్రయోజనం పొందుతారు. ఇది ప్రత్యేకంగా రూ. 500 కంటే తక్కువ ధర కలిగిన ఉత్పత్తులను అందించే విక్రేతలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఫీజు తగ్గింపు ద్వారా దసరా, దీపావళి పండుగలకు షాపింగ్ సమయంలో వ్యాపారులు మరిన్ని ఎక్కువ ఉత్పత్తులను అమెజాన్‌‌లో జాబితా చేసి అమ్మకాలను పెంచుకోడానికి దోహదపడుతుంది.

అమెజాన్ ఇండియాలో సెల్లింగ్ పార్టనర్ సర్వీసెస్ డైరెక్టర్ అమిత్ నందా మాట్లాడుతూ, అమెజాన్‌లో, చిన్న- మధ్యతరహా వ్యాపారాల నుండి వర్ధమాన వ్యాపారవేత్తల వరకు స్థాపించబడిన బ్రాండ్‌ల వరకు అన్ని వర్గాల వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం, అమ్మకందారులు, ముఖ్యంగా సరసమైన ఉత్పత్తులను విక్రయించే వారు, అమెజాన్‌లో ఫీజు తగ్గింపు ద్వారా ప్రయోజనాలు పొందుతారు. ఇది వేగవంతమైన వృద్ధి కోసం వారి వ్యాపారంలో తిరిగి పెట్టుబడి పెట్టడానికి అవకాశం కల్పిస్తుందని అన్నారు.


Similar News