దాదాపు రూ. 22 వేల కోట్ల అప్పులు చెల్లించిన అదానీ గ్రూప్!
అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ ఆరోపణల తర్వాత పెట్టుబడిదారుల నమ్మకాన్ని పొందే ప్రయత్నంలో ఉన్న అదానీ గ్రూప్ అప్పుల భారాన్ని తగ్గించుకుంటున్న సంగతి తెలిసిందే.
ముంబై: అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ ఆరోపణల తర్వాత పెట్టుబడిదారుల నమ్మకాన్ని పొందే ప్రయత్నంలో ఉన్న అదానీ గ్రూప్ అప్పుల భారాన్ని తగ్గించుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఇప్పటివరకు అదానీ గ్రూప్ 2.65 బిలియన్ డాలర్ల(రూ. 21.87 వేల కోట్ల) రుణాలను తిరిగి చెల్లించామని సోమవారం ప్రకటనలో తెలిపింది.
కంపెనీ విడుదల చేసిన నోట్‌లో అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లో వాటాలను హామీగా పెట్టి తీసుకున్న 2.15 బిలియన్ డాలర్ల రుణాలతో పాటు అంబుజా సిమెంట్ కొనుగోలు కోసం తీసుకున్న మరో 700 మిలియన్ డాలర్ల రుణాలను పూర్తిగా చెల్లించామని స్పష్టం చేసింది. 203 మిలియన్ డాలర్ల వడ్డీ కలిపి ఈ చెల్లింపులు చేశామని కంపెనీ వెల్లడించింది.
అలాగే, అదానీ గ్రూపునకు చెందిన నాలుగు లిస్టెడ్ కంపెనీల షేర్లను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ జీక్యూజీ పార్ట్‌నర్స్‌కు రూ. 15,446 కోట్లకు విక్రయించారు. మార్కెట్లో అస్థిర పరిస్థితులు ఉన్నప్పటికీ మెరుగైన లిక్విడిటీ మేనేజ్‌మెంట్, నిధుల రాబట్టడంలో సంస్థకున్న సామర్థ్యాన్ని ఇవి సూచిస్తాయని కంపెనీ తన క్రెడిట్ అప్‌డేట్ నోట్‌లో వివరించింది. ప్రస్తుతానికి అదానీ గ్రూప్ నగదు నిల్వ 41.5 శాతం పెరిగి రూ. 40,351 కోట్లుగా ఉందని పేర్కొంది.