మరో సిమెంట్ కంపెనీ కొనేందుకు అదానీ గ్రూప్ చర్చలు!
దేశీయ అత్యంత సంపన్నుడు గౌతమ్ అదానీ తన వ్యాపార విస్తరణను ఇంకా కొనసాగిస్తున్నారు.
న్యూఢిల్లీ: దేశీయ అత్యంత సంపన్నుడు గౌతమ్ అదానీ తన వ్యాపార విస్తరణను ఇంకా కొనసాగిస్తున్నారు. ఇటీవలే సిమెంట్ రంగంలో అతిపెద్ద కొనుగోలు ద్వారా ఈ వ్యాపారంలోకి ప్రవేశించిన అదానీ, తాజాగా మరో సిమెంట్ కంపెనీని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అప్పుల భారంతో ఉన్న జైప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్‌తో అదానీ గ్రూప్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. కంపెనీకి చెందిన గ్రైండింగ్ యూనిట్, ఇతర ఆస్తులను కొనేందుకు అదానీ గ్రూప్ సుమారు రూ. 5,000 కోట్ల(606 మిలియన్ డాలర్ల)ను చెల్లించేందుకు సిద్ధంగా ఉందని సంబంధిత వ్యక్తులు తెలిపారు.
ప్రస్తుతానికి ఇరు కంపెనీల మధ్య చర్చలు తుది దశలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మధ్యనే అదానీ గ్రూప్ దేశీయ దిగ్గజ ఏసీసీ సిమెంట్, అంబుజా సిమెంట్ కంపెనీలను నిర్వహిస్తున్న హోల్సిమ్ వాటాను స్వాధీనం చేసుకుంది. దీని ద్వారా అదానీ గ్రూప్ ఏడాదికి 6.75 కోట్ల సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రస్తుతం దేశీయ సిమెంట్ రంగంలో ఆదిత్య బిర్లా కంపెనీ అత్యధిక సిమెంట్ ఉత్పత్తితో అగ్రస్థానంలో ఉంది. జైప్రకాష్ పవర్ వెంచర్స్‌కు చెందిన సిమెంట్ విభాగాన్ని సొంతం చేసుకోవడం ద్వారా అదానీ గ్రూప్ ఈ రంగంలో అగ్రగామిగా మారాలని చూస్తోంది. జేపీ గ్రూప్ సిమెంట్ విభాగం ఏడాదికి 20 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే, గత కొంతకాలంగా కంపెనీ అప్పులు పెరిగిపోయాయి. అప్పులు కట్టేందుకు సిమెంట్ విభాగాన్ని విక్రయించనున్నట్టు ఇప్పటికే స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం తెలియజేసింది. ఈ క్రమంలోనే అదానీ గ్రూప్ దీన్ని కొనడానికి చర్చలు ప్రారంభించింది.