Stock Market: అదానీ షేర్ల దెబ్బకు రూ. 6 లక్షల కోట్లు హాంఫట్

గౌతమ్ అదానీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం లంచం ఇచ్చేందుకు ప్రయత్నించిన ఆరోపణల నేపథ్యంలో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది

Update: 2024-11-21 12:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో భారీ నష్టాలు కొనసాగుతున్నాయి. వరుస నష్టాల నుంచి బుధవారం కోలుకున్న సంకేతాలిచ్చిన సూచీలు గురువారం తిరిగి పతనమయ్యాయి. ప్రధానంగా దేశీయ అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో తీవ్ర ఆరోపణలు రావడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, విదేశీ మదుపర్లు మన మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకునేందుకు సిద్దపడటం వంటి కీలక అంశాలు స్టాక్ మార్కెట్ల అత్యధిక నష్టాలకు కారణమయ్యాయి. ముఖ్యంగా గౌతమ్ అదానీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం లంచం ఇచ్చేందుకు ప్రయత్నించిన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో కూడా పెద్ద ఎత్తున అమ్మకాలు చోటుచేసుకున్నాయి. అత్యధికంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ 23 శాతానికి పైగా దెబ్బతినగా, అదానీ ఎనర్జీ 20 శాతం, మిగిలిన కంపెనీల షేర్లు 8-18 శాతం మధ్య కుదేలయ్యాయి. అదానీ షేర్ల ప్రభావంతో గురువారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ. 6 లక్షల కోట్లకు పైగా కోల్పోయారు. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 425 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 422.59 పాయింట్లు నష్టపోయి 77,155 వద్ద, నిఫ్టీ 168.60 పాయింట్లు క్షీణించి 23,349 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, రియల్టీ మీహా అన్ని రంగాలు పతనమయ్యాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో పవర్‌గ్రిడ్, ఆల్ట్రా సిమెంట్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, కోటక్ బ్యాంక్, టాటా స్టీల్ లాభాలను దక్కించుకున్నాయి. అదానీ పోర్ట్స్, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, ఐటీసీ, ఏషియన్ పెయింట్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 84.48 వద్ద ఉంది.    

Tags:    

Similar News