Trading: ఇంట్రాడే‌ ట్రేడింగ్‌లో 70 శాతం మంది ఫెయిల్.. బాధితుల్లో యువతే ఎక్కువ: సెబీ

ఇటీవల కాలంలో స్టాక్‌మార్కెట్లో ప్రజలు తక్కువ సమయంలో ఎక్కువ లాభాన్ని పొందడానికి ఇంట్రాడే‌ ట్రేడింగ్‌పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

Update: 2024-07-24 13:43 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల కాలంలో స్టాక్‌మార్కెట్లో ప్రజలు తక్కువ సమయంలో ఎక్కువ లాభాన్ని పొందడానికి ఇంట్రాడే‌ ట్రేడింగ్‌పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈక్విటీ నగదు విభాగంలో ట్రేడింగ్ చేసే ముగ్గురిలో ఒకరు ఇంట్రాడే చేస్తున్నారు. దీనిలో లాభాలతో పాటు రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుందని తెలిసినప్పటికి కూడా చాలా మంది డే ట్రేడింగ్‌ చేస్తున్నారు. ఇంట్రాడే ట్రేడింగ్‌లో పాల్గొనే వారి సంఖ్య 2019తో పోలిస్తే 300 శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్‌లో ఇంట్రాడే ట్రేడింగ్‌ చేస్తున్నవారిలో దాదాపు 70 శాతం మంది ట్రేడర్లు నష్టాలనే చవిచూశారని అధ్యయనంలో తేలింది. దాదాపు ప్రతి పది మంది డే ట్రేడర్లలో ఏడు మంది నష్టాలను మూటగట్టుకున్నారని సెబీ తెలిపింది.

డే ట్రేడింగ్‌ చేస్తున్న వారిలో 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యువతే ఎక్కువగా ఉన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 18 శాతంతో పోలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో యువత వాటా 48 శాతానికి పెరిగింది. నష్టాలను భరిస్తూ, లాంగ్ టర్మ్ కాకుండా షార్ట్‌ టర్మ్‌లో అధిక లాభాల కోసం యువత డే ట్రేడింగ్‌ చేస్తూ తమ డబ్బులను కోల్పోతున్నారని, చాలా కొద్ది మంది మాత్రమే లాభాలను ఆర్జిస్తున్నారని సెబీ నివేదికలో పేర్కొంది.

అలాగే, సంవత్సరంలో 500 కంటే ఎక్కువ సార్లు ట్రేడింగ్‌లు చేసే వారిలో 71 శాతం మంది నష్టాన్ని చవిచూడగా, గతంతో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు 80 శాతానికి పెరిగింది. లాభాలను సాధించే ట్రేడర్ల కంటే నష్టాలను పొందే ట్రేడర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని, కాబట్టి షార్ట్ టర్మ్ ప్రాతిపదికన కాకుండా లాంగ్ టర్మ్‌లో ఎక్కువ లాభాలను పొందడానికి ప్రయత్నించాలని ట్రెడర్లకు సెబీ సూచిస్తుంది.

Tags:    

Similar News