ఐదేళ్లలో 2,000 శాతం పెరగనున్న 5G సబ్‌స్క్రైబర్లు!
భారత్‌లో 5జీ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2028 నాటికి 2,125 శాతం పెరిగి 69 కోట్లకు చేరుకుంటుందని బుధవారం ఓ నివేదిక వెల్లడించింది.
న్యూఢిల్లీ: భారత్‌లో 5జీ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2028 నాటికి 2,125 శాతం పెరిగి 69 కోట్లకు చేరుకుంటుందని బుధవారం ఓ నివేదిక వెల్లడించింది. 2022 నాటికి దేశంలో 5జీ వినియోగదారులు 3.1 కోట్ల మంది ఉన్నారు. ఈ స్థాయి వృద్ధి వల్ల దేశీయంగా మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ల కవరేజీ 2022లో 77 శాతం నుంచి 2028 నాటికి 94 శాతానికి చేరుకోనుంది.
టీమ్‌లీజ్ సర్వీసెస్ బుధవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, 5జీ టెక్నాలజీని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడానికి భారత్ 2025 నాటికి కనీసం 80 లక్షల మంది నైపుణ్యం కలిగిన ఉద్యోగులను కలిగి ఉండాలి. 5జీ సాంకేతికత ద్వారా ప్రధానంగా ఐటీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) రంగాలు ఎక్కువ లబ్దిని పొందనున్నాయి.
ఆ తర్వాత విద్య, గేమింగ్, రిటైల్, ఈ-కామర్స్ రంగాలు ఉన్నాయి. 5జీ అందుబాటులోకి వచ్చే కొద్దీ టెక్ సంబంధిత ఉద్యోగాల్లో 80 శాతం పెరుగుదల ఉంటుందని నివేదిక అంచనా వేసింది. 5జీ ద్వారా టెలికాం కంపెనీలతో పాటు నెట్‌వర్క్ ఇంజనీర్లు, క్లౌడ్ కంప్యూటింగ్ ఇంజనీర్లు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, డేటా వంటి ఉద్యోగాలకు అధిక ప్రాధాన్యత ఉంటుందని టీమ్‌లీజ్ సర్వీసెస్ సీఈఓ కార్తీక్ నారాయణ్ అన్నారు.