లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై మార్కెట్లు ఎలా రియాక్ట్ అవుతాయంటే..!
తక్కువ ఓటింగ్ శాతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీకి సవాలుగా మారాయి.
దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పండుగ ముగింపు దశకు వచ్చేసింది. శనివారంతో చివరి దశ పోలింగ్ పూర్తవనుంది. ఆరు వారాల పాటు సాగిన జాతీయ ఎన్నికల కౌంటింగ్ జూన్ 4న జరగనుంది. ఫలితాలపై ప్రజలతో పాటు ప్రధానంగా స్టాక్ మార్కెట్లు అత్యంత ఆసక్తిగా చూస్తున్నాయి. ఇప్పటికే ముగిసిన పోలింగ్ దశలతో ఇన్వెస్టర్లు, రాజకీయ విశ్లేషకులు ఫలితాలపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ఓటింగ్ శాతం జరగడం ముఖ్యంగా ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీకి సవాలుగా మారాయి. గత 2019 ఎన్నికల్లో మొత్తం 543 స్థానాలకు గానూ బీజేపీ, దాని మిత్రపక్షాలు 352 సీట్లను దక్కించుకున్నాయి. బీజేపీ ఒంటరిగానే 303 సీట్లను సాధించింది. ఈ నేపథ్యంలో శనివారం ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. అయితే, ఏప్రిల్ ప్రారంభంలో వచ్చిన ఒపీనియన్ పోల్స్‌లో బీజేపీ మూడోసారి కూడా ఎన్నికల్లో స్వీప్ చేస్తుందని అంతా భావించారు. స్టాక్ మార్కెట్లు కూడా 2019 తరహాలోనే దాదాపు 300 సీట్లను బీజేపీ దక్కించుకోగలదని అంచనా వేశాయి. కానీ, ప్రచారం ముగింపునకు వచ్చేసరికి పరిస్థితులు అస్పష్టంగా మారాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల తీర్పునకు మూడు రోజులకు ముందు ఫండ్ మేనేజర్లు, విశ్లేషకులు, ఆర్థికవేత్తలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు.
బీజేపీ గెలిస్తే..
2019 కంటే బలమైన మెజారిటీని బీజేపీ గెలవగలిగితే మౌలిక సదుపాయాలపై ఖర్చు కొనసాడం, తయారీ రంగానికి ప్రోత్సాహకం వంటి వృద్ధి ఆధారిత ఆర్థిక విధానాల అంచనాలతో ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ కానున్నాయని ఐటీఐ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ రాజేష్ భాటియా అన్నారు. బీజేపీ గెలిస్తే సెన్సెక్స్, నిఫ్టీ 4-5 శాతం మేర ర్యాలీ చేస్తాయని, ఫారెక్స్ కన్సల్టెన్సీ, అసెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ ఐఎఫ్ఏ గ్లోబల్ ఫౌండర్ అభిషేక్ గోయెంకా చెప్పారు. ప్రధాని మోడీని మార్కెట్ సానుకూలంగా చూస్తోంది. తద్వారా రాజకీయ స్థిరత్వం కొనసాగుతుందని, విధాన పరమైన నిర్ణయాలు కొనసాగుతాయని సీనియర్ ఇన్వెస్టర్ జేమ్స్ థామ్ తెలిపారు.
మెప్పించకపోతే..
ఒకవేళ మూడవ పర్యాయంతో బీజేపీ ప్రజల నుంచి మెప్పు పొందక 2019 కంటే తక్కువ సీట్లు గెలిస్తే.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 272 సీట్లకు పరిమితమైతే స్టాక్ మార్కెట్లలో కొంత అస్థిరత ఉండొచ్చు. ప్రస్తుత పోలింగ్ సరళిని గమనిస్తే బీజేపీ, దాని మిత్రపక్షాల విజయం ఊహించినదాని కంటే తక్కువగా ఉంటుందనే అంచనాలు మార్కెట్లలో ఇటీవలి నష్టాలను చూస్తే తెలిస్తోందని షేర్‌ఖాన్ హెడ్ గౌరవ్ దువా చెప్పారు.
ఇండియా కూటమి అధికారం చేపడితే..
అంచనాలను కాదని, ప్రస్తుతం ఉన్న ప్రచారానికి భిన్నంగా ఎన్డీఏ ఓటమి పాలై కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఫలితాలు వస్తే మార్కెట్లలో అమ్మకాలకు అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్లు ఇప్పటివరకు ప్రస్తుత ప్రభుత్వ కొనసాగింపునే ఆశిస్తున్నాయి. కాబట్టి మరో పార్టీ గెలిస్తే ప్రతికూలతను ఎదుర్కొనవచ్చని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ సీనియర్ ఫండ్ మేనేజర్ మితుల్ కలావాడియా చెప్పారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి గెలుపు ఫలితాలు వెలువడితే స్టాక్ మార్కెట్లు 10 శాతం వరకు పతనమయ్యే అవకాశాలు ఉన్నాయని ఐఎఫ్ఏ గ్లోబల్‌కు చెందిన అభిషేక్ గోయెంకా వెల్లడించారు.