కెనడాలో హైదరాబాదీ విద్యార్థి మృతి
వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న అహ్మద్ గురువారం ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలినట్టు తెలుస్తోంది.
దిశ, నేషనల్ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన షేక్ ముజమిల్ అహ్మద్ అనే 25 ఏళ్ల విద్యార్థి కెనడాలో గుండెపోటుతో మరణించాడు. దీంతో విద్యార్థి కుటుంబంలో విషాదం నెలకొంది. అహ్మద్ భౌతికకాయాన్ని భారత్‌కు తీసుకురావడానికి సహాయం చేయాల్సిందిగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను అహ్మద్ కుటుంబం అభ్యర్థించింది. 2022, డిసెంబర్ 22న అహ్మద్ అంటారియో కిచెనర్ సిటీలో ఉన్న వాటర్‌లూ క్యాంపస్‌లోని కోనెస్టోగా కాలేజీలో ఐటీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నాడు. గత వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న అహ్మద్ గురువారం ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రాణాలు విడిచినట్టు సమాచారం. ఈ విషయాన్ని అహ్మద్ స్నేహితులు హైదరాబాద్‌లోని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన అహ్మద్ మరణవార్తతో అతని కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అహ్మద్ మృతదేహాన్ని భారత్‌కు రప్పించేందుకు అహ్మద్ బంధువులు విదేశాంగ మంత్రి జై శంకర్‌ను కోరగా, మంది కెనడాలో ఉన్న భారతీయ రాయబారి కార్యాలయంతో మాట్లాడి అవసరమైన ఏర్పాటు చేశారు.