పక్కా ప్లాన్‌తో బలపడుతున్న BSP.. పార్టీలకు గట్టి షాక్.?

దిశ, భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బహుజన సమాజ్ పార్టీ (BSP) చాపకింద నీరులా విస్తరిస్తోంది. వచ్చే ఎన్నికలనాటికి జిల్లాలో బలమైన రాజకీయ శక్తిగా తయారు కావాలనే లక్ష్యంతో బీఎస్పీ నాయకులు అడుగులు వేస్తున్నారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఎర్రా కామేశ్, మరో 10 మంది జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా ఇన్‌చార్జీలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు నానుమాద్రి కృష్ణార్జునరావు (చర్ల), ఇర్పా కామరాజు, మల్లిఖార్జున్‌ల పర్యవేక్షణలో పార్టీ బలోపేతం అవుతోంది. […]

Update: 2021-09-27 04:50 GMT

దిశ, భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బహుజన సమాజ్ పార్టీ (BSP) చాపకింద నీరులా విస్తరిస్తోంది. వచ్చే ఎన్నికలనాటికి జిల్లాలో బలమైన రాజకీయ శక్తిగా తయారు కావాలనే లక్ష్యంతో బీఎస్పీ నాయకులు అడుగులు వేస్తున్నారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఎర్రా కామేశ్, మరో 10 మంది జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా ఇన్‌చార్జీలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు నానుమాద్రి కృష్ణార్జునరావు (చర్ల), ఇర్పా కామరాజు, మల్లిఖార్జున్‌ల పర్యవేక్షణలో పార్టీ బలోపేతం అవుతోంది.

ఇతర పార్టీలకు భిన్నంగా బీఎస్పీ పటిష్ట నిర్మాణం జరుగుతోంది. బీఎస్పీ అధినేత్రి మాయావతి అడుగుజాడల్లో నడవాలనే లక్ష్యంతో ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కీలకమైన ఉద్యోగాన్ని సైతం వదిలి బీఎస్పీలో చేరి రాష్ట్ర కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అందరిచూపు ఆ పార్టీ వైపు మళ్ళింది. ముఖ్యంగా ప్రవీణ్‌కుమార్‌తో పరిచయాలు కలిగిన స్వేరోలు అంతా బీఎస్పీ వైపు చూస్తున్నారు. అటవీప్రాంత మారుమూల గ్రామాల్లో సైతం స్వేరోల మూలంగా ఇప్పుడు బీఎస్పీ ప్రధాన చర్చనీయాంశమైంది.

జిల్లాలో పటిష్ట నిర్మాణం.. బలమైన నాయకత్వం

ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ నేనుంటా, బాధితులకు అండగా నిలుస్తా అని భరోసా కల్పిస్తూ, ప్రజల్లోకి చొచ్చుకొని పోతున్న బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఎర్రా కామేశ్ నాయకత్వంలో పార్టీ బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతోంది. జాతీయ, రాష్ట్ర కమిటీల డైరెక్షన్‌లో జిల్లా నాయకులు ముందడుగు వేస్తున్నారు. ఈ పార్టీకి మండల కమిటీలు ఉండవు. ఎగువన జిల్లా కమిటీ, దిగువన బూత్ లెవల్ కమిటీలే ఉంటాయి. 11 మందితో జిల్లా కమిటీ, ఐదుగురితో నియోజకవర్గ కమిటీలు, 13 మందితో సెక్టార్ కమిటీలు, ఐదుగురితో పోలింగ్ బూత్ కమిటీలు మాత్రమే ఉంటాయి.

10 బూత్ కమిటీల పరిధిని ఒక సెక్టార్ కమిటీగా ఏర్పాటు చేస్తారు. ఒక్కో నియోజకవర్గానికి సుమారు 20 సెక్టార్ కమిటీలు, సుమారు 200 పోలింగ్ బూత్ కమిటీలు ఉంటాయి. వీటిలో వెయ్యి నుంచి 1200 మంది సభ్యులు ఉంటారు. వీళ్ళే బీఎస్పీ నాయకులుగా ఉండి పార్టీకి బలంగా ఉంటారు. ఒక్కో నాయకుడి కుటుంబం, బంధువుల నుంచి కనీసం పది ఓట్లు లెక్కవేసుకున్నా 10 నుంచి 12 వేల ఓట్లు వస్తాయి. ఇది బీఎస్పీకి స్థిరమైన ఓటు బ్యాంకుగా పార్టీ పటిష్ట నిర్మాణానికి పునాది వేస్తుంది. దీనికి స్వేరోల నుంచి లభించే సపోర్టు అదనపు బలంగా చెప్పవచ్చు. కమిటీల్లోని లీడర్లే కాకుండా పార్టీ బలంగా ఉన్న చోట ప్రచారం కోసం అవసరాన్ని బట్టి ఐదుగురితో గ్రామ కమిటీలను కూడా అనధికారికంగా నియమిస్తున్నట్లుగా సమాచారం.

అన్ని పార్టీల ఓట్లకు గండిపడే అవకాశం..

జిల్లాలో బలోపేతం అవుతున్న బీఎస్పీ వల్ల అన్ని పార్టీలకు ఎంతో కొంత నష్టం జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పలు పార్టీల్లో పనిచేస్తున్నా పదవులు రాక, సరైన గుర్తింపు లభించక అసంతృప్తిగా ఉన్న బహుజన నాయకుల చూపు ఇప్పుడు బీఎస్పీ వైపు పడినట్లుగా తెలుస్తోంది. అంతేగాక రాజకీయ ఆసక్తి ఉన్నప్పటికీ ఏ పార్టీలతో సంబంధంలేని తటస్తులు, ముఖ్యంగా రాజకీయ పరిస్థితులను నిశితంగా గమనించే విద్యావంతులు, విద్యార్థులు బీఎస్పీ వైపు దృష్టిపెట్టినట్లుగా కనిపిస్తోంది.

బీఎస్పీలో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ చేరికతో ఆ పార్టీకి రాష్ట్రంలో కొత్త ఊపు వచ్చిందనేది వాస్తవం. అదే ప్రభావం గ్రామ, మండల స్థాయిల్లో కొంత కనిపిస్తోంది. ముఖ్యంగా వివిధ పార్టీల్లోని దళితుల చూపు ఏనుగు పార్టీ వైపు మెల్లగా మరలుతోంది. ఇది ముందే పసిగట్టి, దళితుల ఓటు బ్యాంకు కాపాడుకునే పనిలో అధికార ప్రభుత్వం (టీఆర్ఎస్ పార్టీ) దళిత బంధుని తెరపైకి తీసుకొస్తే, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన దండోరా సభలు నిర్వహిస్తోంది.

బహుముఖ వ్యూహంతో బహుజనుల పార్టీ..

బహుముఖ వ్యూహంతో బహుజనుల పార్టీ బీఎస్పీ వచ్చే ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. పోలింగ్ బూత్, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కమిటీలను పటిష్టంగా నిర్మించడం, మరోవైపు సమస్యలతో సతమతమవుతున్న ప్రజలను సమీకరించి పాలక ప్రభుత్వాల వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టి, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడం కోసం బీఎస్పీ ఇప్పుడు దూకుడుగా అడుగులు వేస్తోంది. అందుకే ప్రజలకు బీఎస్పీ చేరువ అవుతోంది.

ఆ క్రమంలోనే బీఎస్పీలోకి జిల్లాలో వలసలు ప్రారంభమయ్యాయి. ఇతర పార్టీల నుంచి వచ్చి బీఎస్పీలో చేరుతున్నారు. అయితే, ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని తొందరపడి చేర్చుకోకుండా పార్టీ సిద్ధాంతం, దానికితోడు చేరడానికి వచ్చే నేతల వ్యక్తిగత ప్రవర్తన, రాజకీయ నడవడిక, ప్రజా సంబంధాలు వంటి అనేక అంశాలు పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తరఫున పోటీ చేయడానికి ఇప్పటి నుంచే కొందరు బహుజన మేధావులు, విద్యావేత్తలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Tags:    

Similar News