పంచాయతీ కార్యదర్శికి సమ్మె నోటీస్

గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఈ నెల 27, 28 తేదీల్లో రాష్ట్ర వ్యాప్త టోకెన్ సమ్మెపై టేకులపల్లి పంచాయతీ కార్యదర్శికి గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ సమ్మె నోటీస్ అందించారు.

Update: 2024-12-26 12:08 GMT

దిశ, టేకులపల్లి : గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఈ నెల 27, 28 తేదీల్లో రాష్ట్ర వ్యాప్త టోకెన్ సమ్మెపై టేకులపల్లి పంచాయతీ కార్యదర్శికి గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ సమ్మె నోటీస్ అందించారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27, 28 తేదీల్లో జరిగే రాష్ట్ర వ్యాప్త టోకెన్ సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ( ఐఎఫ్టీయూ) టేకులపల్లి మండల అధ్యక్షులు మూడు బిచ్చు గ్రామపంచాయతీ కార్మికులను కోరారు. గ్రామ పంచాయతీ కార్మికులు చెత్త, చెదారం మధ్య పని చేస్తూ తమ ఆరోగ్యాలను ఫణంగా పెట్టి పల్లెలను శుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతుంటే వారి సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. వారికి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వకుండా దోచుకుంటున్నారని విమర్శించారు. మున్సిపాలిటీలో, గ్రామపంచాయతీలో పనిచేసే కార్మికులు ఒకే పని చేస్తున్నప్పటికీ మున్సిపాలిటీలో జీవో నెంబర్ 60 ప్రకారం16,500 చెల్లిస్తుంటే గ్రామపంచాయతీ కార్మికులకు మాత్రం 9500 మాత్రమే ఇస్తున్నారన్నారు.

     ఈ వేతనాలు కూడా ప్రతి నెలా చెల్లించకుండా పెండింగ్ పెడుతున్నారు అన్నారు. దీనివల్ల కుటుంబ పోషణ భారమై కార్మికులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అన్నారు. మల్టీపర్పస్ విధానం పేరుతో అనుభవం లేని పనులు చేయించడం వలన అనేక మంది మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి ఎలాంటి చట్టబద్ధ హక్కులు, సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని, గ్రామపంచాయతీ కార్మికులకు ప్రతినెలా జీతాలు చెల్లించుటకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలని, మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని, పదవీ విరమణ బెనిఫిట్ కింద 5 లక్షలు చెల్లించాలని, కార్మికులు మరణించినా, పదవీ విరమణ పొందినా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు గ్రామపంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 27, 28 తేదీలలో రాష్ట్ర వ్యాప్త టోకెన్ సమ్మె కు పిలుపునిచ్చినట్టు చెప్పారు. సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ( ఐఎఫ్టీయూ ) నాయకులు జినక ప్రసాద్, బానోతు నాను, నజీమ్ పాషా తదితరులు పాల్గొన్నారు. 


Similar News