ఆశా వర్కర్ల సమస్యలపై సీఎం స్పందించాలి

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లకు ఫిక్డ్స్​ వేతనం నిర్ణయిస్తామని, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, వాటిని నెరవేర్చాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

Update: 2024-12-26 12:34 GMT

దిశ, ఖమ్మం టౌన్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లకు ఫిక్డ్స్​ వేతనం నిర్ణయిస్తామని, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, వాటిని నెరవేర్చాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర గురువారం ఖమ్మం నగరానికి చేరుకుంది. దీనికి తమ్మినేని వీరభద్రం సంఘీభావాన్ని ప్రకటించారు. పెవిలియన్ గ్రౌండ్ నుంచి ప్రదర్శనగా మంచి కంటి భవనంకి చేరుకొని అక్కడ సభను నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆశాల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆశాలకు వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిందని తెలిపారు.

    కానీ నేడు మరిచిందన్నారు. ఆశాలకు ఫిక్సిడ్ వేతనం రూ.18 వేలు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆరోగ్య శాఖా మంత్రికి, రాష్ట్ర ఉన్నతాధికారులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు అనేకసార్లు వినతిపత్రాలు అందించినా ఫలితం లేదన్నారు. దాంతో సమస్యల పరిష్కారం కోసం 2024 డిసెంబర్ 15 నుంచి 31 వరకు బస్ జాతా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ బస్సు జాతాకు సీపీఎం పూర్తి మద్దతు తెలియజేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి సమస్యల్ని పరిష్కరించాలని కోరారు.

హక్కులను కాలరాస్తున్న బీజేపీ : పాలడుగు భాస్కర్

సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, యాత్ర రథసారథి, ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి.జయలక్ష్మి మాట్లాడుతూ సీఐటీయూ అనేక పోరాటాలు నిర్వహించగా 2013లో జరిగిన 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సమావేశంలో ఆశాలను కార్మికులుగా గుర్తించాలని, కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని తీర్మానించినట్టు తెలిపారు. ఆ తర్వాత 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 45వ ఐఎల్సీ సిఫారసులు అమలు చేయలేదన్నారు. దీనివల్ల తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 10 లక్షల మంది ఆశాలు నష్టపోతున్నారన్నారు. ఆశాలకు కేవలం రూ.3 వేలు మాత్రమే పారితోషికం చెల్లిస్తుందన్నారు. రూ.18 వేల జీతం ఇవ్వాలని కోరారు.

    ఆశా వర్కర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రానున్న అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని, అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు మద్దతు ప్రకటించారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మ విష్ణువర్ధన్, కళ్యాణ వెంకటేశ్వరరావు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జె.మంగమ్మ, కార్యదర్శి బి.అమల, శ్రామిక మహిళా జిల్లా నాయకురాలు పి.రమ్య, వై.విక్రమ్, తిరుమలచారి, సీహెచ్.విటల్, పెరుమాళ్ల పల్లి మోహన్ రావు, జిల్లా ఉపేందర్, మూదాం శ్రీను, శీలం నరసింహారావు, చంద్రశేఖర్​, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు రమణ, కమల, రాణి, రాధ, విజయ పాల్గొన్నారు. 


Similar News