దిశ,బూర్గంపాడు : బూర్గంపాడు మండలంలో కొంత కాలంగా కోతుల బెడద ఎక్కువైంది.మండలంలోని అన్ని ప్రాంతాల్లో వానరాలు స్వైర విహారం చేస్తున్నాయి.వానరులు విచ్చలవిడిగా తిరుగుతూ వృద్ధులు,మహిళలు, చిన్నపిల్లలను కురుస్తున్నాయి.కోతులు మందలు మందలుగా తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.ఇళ్లలోకి దూరి తినుబండారాలు,పాత్రలు,సీసాలతో సహా ఎత్తుకెళ్తున్నాయి.అడ్డగించిన వారిని కరుస్తూ భయపెడుతున్నాయి. ప్రజలు కోతులతో ఇబ్బందులు పడి అదిలించ బోయిన పైనబడి కురుస్తుండడంతో గాయాలపాలవుతున్నారు.అధికారులు ఈ సమస్యలను పట్టించుకోకుండా తమకేమవుతుందిలే అని నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వీటి వల్ల ఎదురయ్యే ఇబ్బందులు తారాస్థాయికి చేరుకున్నాయి. పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడు మాత్రం నామమాత్రమే చర్యలు తీసుకుంటున్నారు.
పదుల సంఖ్యలో కేసుల నమోదు..
మండలంలోని మోరంపల్లి బంజర గ్రామంలో గత రెండు రోజుల్లో కోతులు పలువురిని గాయపరిచాయి.శుక్రవారం జ్యోతిరావు పూలే కాలనీకి చెందిన మహిళలు విగ్నేశ్వర,పెరిక అనూషలపై దాడి చేయడంతో వారు గాయపడ్డారు. మోరంపల్లి బంజర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోతులు దాడి చేసిన ఘటనలో రెండు నెలల్లో దాదాపు 20 కేసులు నమోదు అయ్యాయి.
తక్షణమే చికిత్స చేయించుకోవాలి..
కోతి కరిస్తే తక్షణమే ప్రథమ చికిత్స చేసుకోవాలని మొరంపల్లిబంజర్ పీహెచ్సీ వైద్యురాలు లక్ష్మీ సాహితీ పేర్కొన్నారు.కరిచిన ప్రాంతాన్ని రన్నింగ్ ట్యాప్ వాటర్ తో శుభ్రం చేసుకుని,అనంతరం సబ్బుతో కడగి, కట్టు కట్టకుండా త్వరితగతిన ప్రభుత్వ ఆస్పత్రి కెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. స్వల్ప గాయాలను కూడా నిర్లక్ష్యం చేయవద్దన్నారు.