సంగారెడ్డి: జిన్నారంలో విషవాయువులతో ఉక్కిరిబిక్కిరి

సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం సమీపంలో పారిశ్రామిక ప్రాంతం నుంచి విషవాయువులు వెలువడటంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

Update: 2023-05-30 02:32 GMT

దిశ,వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం సమీపంలో పారిశ్రామిక ప్రాంతం నుంచి విషవాయువులు వెలువడటంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ ప్రాంతంలో గతంలోనూ ఇటువంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ సారి పరిస్థితి కాస్త తీవ్రంగా ఉండటంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. గడ్డపోతారం పారిశ్రామికవాడలో ఈ విషవాయువుల తీవ్రత ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంలో ఇప్పటివరకు అధికారులు స్పందించకపోవడంతో ప్రజలు రోడ్డెక్కారు. ప్రజలు రోడ్డుపై బైటాయించడంతో గడ్డపోతారం పారిశ్రామికవాడలో వాహనాలు నిలిచిపోయాయి. వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్ నిలిచిపోయింది. వారం నుంచి విషవాయువులు వెలువడుతున్నా అధికారులు ఇంత వరకూ స్పందించలేదని అందుకే ఆందోళన చేపడుతున్నామని ప్రజలు చెబుతున్నారు.

గతంలోనూ పారిశ్రామిక వాడల్లో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు స్థానిక ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలున్నాయి. పరిశ్రమల నుంచి వెదజల్లే కాలుష్యం జనం జీవనంపై విషయం చిమ్ముతోంది. నిత్యం పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలతో సమీప ప్రాంతాల ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. పారిశ్రామికవాడలో ఉన్న రసాయన పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు, విషవాయువులు అక్కడి ప్రజల జీవన విధానాన్నే అతలాకుతలం చేస్తున్నాయి. పరిశ్రమ వ్యర్థాలు నిత్యం బయటకు వస్తున్నాయి. పరిశ్రమల నిర్వాహకులు నిబంధనలను గాలికొదిలేసి.. ప్రజల ప్రాణాలకు హానికలిగిస్తున్నా పాలకులు, అధికారులు దాని గురించి పట్టించుకోవడం లేదు.

Tags:    

Similar News