BREAKING: ఎలిఫెంట్ ఎఫెక్ట్.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లో వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

Update: 2024-03-06 10:06 GMT

దిశ, వెబ్‌డెస్క్/ఆదిలాబాద్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లో వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొమురంభీం జిల్లా సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోన‌ప్ప త‌న అనుచ‌రులు, ముఖ్య నాయకులతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని వెంట పెట్టుకుని సీఎం రేవంత్‌రెడ్డిని క‌లిశారు. కొద్ది రోజులుగా ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతున్న నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం రాత్రి నుంచి నాట‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి.

అయితే, బీఆర్ఎస్‌తో బీఎస్పీ పొత్తు ఉంటుంద‌ని కేసీఆర్ ప్రక‌టించారు. త‌న‌కు మాట మాత్రమైనా పొత్తు గురించి చెప్పలేద‌ని కోన‌ప్ప ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. అనంత‌రం హైదాబాద్‌లోని త‌న నివాసానికి కొంతమంది ముఖ్య నాయ‌కులను పిలుపించుకుని రాత్రికి రాత్రే మంతనాలు జరిపారు. విష‌యం తెలుసుకున్న కేసీఆర్‌, కేటీఆర్ పార్టీని వీడొద్దని కోరిన‌ట్లు స‌మాచారం. అయినా, అదేమీ ప‌ట్టని కోనేరు కొన‌ప్ప, ఆయన సోదరుడు సోద‌రుడు, జ‌డ్పీ చైర్మన్ కృష్ణరావు, కాగజ్‌నగర్ మునిసిపల్ చైర్మన్‌, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీలు, స‌ర్పంచ్‌లు హైద‌రాబాద్ వెళ్లారు.

సిర్పూర్ నియోజ‌క‌వ‌ర్గంలో తన ఓటమికి ప్రధాన కారకుడైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో పొత్తు పెట్టుకోవ‌డం ఏంట‌ని కోన‌ప్ప బీఆర్ఎస్ పెద్దలను ప్రశ్నించారు. అదే స‌మ‌యంలో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీపై దుమ్మెత్తిపోసిన బీఎస్పీ పార్టీతో పొత్తెలా పెట్టుకుంటార‌ని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వేలాది మంది నేత‌లు, కార్యక‌ర్తలు సైతం తాము కోన‌ప్పతోనే ఉంటామ‌ని వెల్లడించారు.

Tags:    

Similar News