పోలీసుల కస్టడీలో అఖిల ప్రియ సమాధానం ఇదే!
దిశ, క్రైమ్ బ్యూరో : బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను పోలీసులు కస్టడీలో విచారిస్తున్నారు. కిడ్నాప్‌కు సంబంధించిన అంశాలను పలు కోణాలలో ప్రశ్నించినప్పటికీ, అందుకు అఖిల ప్రియ సహకరించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. సికింద్రాబాద్ కోర్టులో అఖిల ప్రియ బెయిల్ పిటిషన్, పోలీసులు కస్టడీ పిటిషన్‌లతో నాలుగు రోజుల పాటు ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అఖిల ప్రియను మూడ్రోజుల కస్టడీ విచారణకు కోర్టు అనుమతి ఇవ్వగా, […]
దిశ, క్రైమ్ బ్యూరో : బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను పోలీసులు కస్టడీలో విచారిస్తున్నారు. కిడ్నాప్‌కు సంబంధించిన అంశాలను పలు కోణాలలో ప్రశ్నించినప్పటికీ, అందుకు అఖిల ప్రియ సహకరించడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. సికింద్రాబాద్ కోర్టులో అఖిల ప్రియ బెయిల్ పిటిషన్, పోలీసులు కస్టడీ పిటిషన్‌లతో నాలుగు రోజుల పాటు ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అఖిల ప్రియను మూడ్రోజుల కస్టడీ విచారణకు కోర్టు అనుమతి ఇవ్వగా, సోమవారం సాయంత్రం చంచల్‌గూడ జైలు నుంచి అఖిల ప్రియను బేగంపేట మహిళా పీఎస్‌కు తరలించారు. రెండో రోజు విచారణ సందర్భంగా అఖిలప్రియపై పలు ప్రశ్నల వర్షం కురిపించినప్పటికీ, ఆమె నుంచి పోలీసులు సమాచారాన్ని రాబట్టలేకపోయారనే విషయం తెలుస్తోంది.
నేను మాజీ మంత్రిని..
కిడ్నాప్ కేసులో పోలీసులు ఇప్పటికే అఖిల ప్రియ సహా మిగతా నిందితుల కాల్ డేటా ఆధారాలను సేకరించిన పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారమే ఈ కిడ్నాప్ చేశారంటూ పోలీసులు చెబుతున్నారు. కిడ్నాప్‌కు అఖిల ప్రియ కీలక సూత్రధారిగా వ్యవహారించారంటూ ఆధారాలు సేకరించిన పోలీసులు, ఇంకా ఈ కేసులో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు ఎవరెవరూ, భర్త భార్గవ్ రామ్, ఏవీ సుబ్బారెడ్డి పాత్ర ఎంత అనే విషయాలను విచారణలో ప్రశ్నించినట్టు సమాచారం. కిడ్నాపర్లకు సుఫారీ ఎంతకు కుదుర్చుకున్నారు.. ఎంత చెల్లించారనే అంశాలను కూడా అడిగినట్టు తెలుస్తోంది.
కిడ్నాప్ చేసిన తర్వాత ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఏమైనా కాల్ చేశారా..? వారికి మీరేమని సమాధానం చెప్పారు. కిడ్నాప్ అయిన బాధితులు సేఫ్‌గా ఉన్నారంటూ పోలీసులకు చెప్పిందెవరు..? భార్గవ్ రామ్ ఆచూకీ ఎక్కడ..? అసలు కిడ్నాప్ ప్లాన్ ఎవరిదీ..? ప్రవీణ్ రావు, అతని సోదరులు సంతకాలు చేసిన డాక్యుమెంట్లు ఎవరి దగ్గర ఉన్నాయంటూ పలు కోణాల్లో పోలీసులు విచారించారు. వీటన్నింటికీ తోడుగా సెల్‌ఫోన్ టవర్ లొకేషన్, కాల్ డేటా, సీసీ ఫుటేజీ తదితర పూర్తి ఆధారాలు ఉన్నాయంటూ చెప్పినా కూడా అఖిల ప్రియ పోలీసుల ప్రశ్నలకు నోరు మెదపలేదన్నట్టుగా సమాచారం. అంతే కాకుండా, నేను మాజీ మంత్రిని, ప్రజలతో నిత్యం సంబంధాలు ఉంటాయి.. నాకు ఎంతో మంది ఫోన్ చేస్తుంటారు అనే విషయాన్ని మాత్రమే సమాధానంగా చెప్పినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో నార్త్ జోన్ డీసీపీ కమలేశ్వర్ అఖిల ప్రియను విచారిస్తున్న బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తనకు కాల్ చేసిన వారెవరంటూ అఖిల ప్రియను ప్రశ్నించినట్టు సమాచారం.
అఖిల సోదరుడు జగత్ పాత్ర..
కిడ్నాప్ వ్యవహారంలో అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ పాత్రలు ఉన్నట్టుగా తెలుస్తుండగా.. తాజాగా అఖిల ప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ పేరు తెరపైకి వస్తోంది. ఈ కేసులో అఖిల ప్రియతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు అఖిల ప్రియ, భార్గవ్ రామ్ పీఏలు కాగా, మూడో వ్యక్తి డ్రైవర్ బాల చెన్నయ్య. అయితే, ఈ బాల చెన్నయ్య జగత్ విఖ్యాత్ డ్రైవర్ కావడంతో ఈ కేసుతో జగత్ విఖ్యాత్ కు కూడా ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నాప్ ప్రణాళికను అమలు చేయడానికి ముందు కిడ్నాపర్లతో జగత్ విఖ్యాత్ మాట్లాడినట్టుగా సందేహాలు ఉన్నాయి. అఖిల ప్రియ అరెస్టు సమయంలో జగత్ విఖ్యాత్ నుంచి కొన్ని వివరాలను సేకరించిన పోలీసులు ఆ తర్వాత వదిలేశారు. డ్రైవర్ బాల చెన్నయ్య స్టేట్ మెంట్ ఆధారంగా అఖిల ప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ ను పోలీసులు మరోసారి విచారించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, అఖిల ప్రియను మూడో రోజు బుధవారం విచారించి, సాయంత్రం న్యాయమూర్తి ఎదుట హజరు పర్చిన అనంతరం తిరిగి చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు.
గోవాలో నలుగురు అదుపులోకి..
ఈ కిడ్నాప్ కేసులో మొత్తం 19 మందికి సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు నిర్థారణకు వచ్చారు. ఇప్పటికే అఖిల ప్రియతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ ముందుగా బెంగుళూరులో ఉన్నారనీ, ఆ తర్వాత గోవాలో ఉన్నారనే ప్రచారం జరిగింది. ఇదిలా ఉండగా, భార్గవ్ రామ్‌తో పాటు మిగతా నిందితులను పలు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్న పోలీసులకు గోవాలో నలుగురు ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనుగొన్నారు. దీంతో ఆ నలుగురిని గోవాలో అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకొస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. ఈ నలుగురిలో ఎవరెవరు ఉన్నారో తెలియాల్సి ఉంది. భార్గవ్ రామ్ మాత్రం ఈ నలుగురిలో లేడన్నట్టుగా తెలుస్తోంది.