కోర్టుకు పోతామంటున్న సింగరేణి కార్మికులు.. ఎందుకు ?
దిశ ప్రతినిధి, కరీంనగర్: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల నగారా మోగించేందుకు కార్మిక శాఖ కసరత్తులు చేస్తున్నది. ఈ మేరకు సింగరేణిలో కార్మికులు, కార్మిక సంఘాలు, వాటి భాద్యుల వివరాలను పంపించాలని కేంద్ర కార్మిక శాఖ యాజమాన్యానికి లేఖ రాసింది. దీంతో బొగ్గు గనుల్లో గుర్తింపు సంఘం ఎన్నికల కోలాహలం మొదలు కానుందన్న ప్రచారం జోరందుకుంది. అయితే సంస్థలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న చర్చ కూడా ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. గుర్తింపు […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల నగారా మోగించేందుకు కార్మిక శాఖ కసరత్తులు చేస్తున్నది. ఈ మేరకు సింగరేణిలో కార్మికులు, కార్మిక సంఘాలు, వాటి భాద్యుల వివరాలను పంపించాలని కేంద్ర కార్మిక శాఖ యాజమాన్యానికి లేఖ రాసింది. దీంతో బొగ్గు గనుల్లో గుర్తింపు సంఘం ఎన్నికల కోలాహలం మొదలు కానుందన్న ప్రచారం జోరందుకుంది. అయితే సంస్థలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న చర్చ కూడా ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. గుర్తింపు సంఘం టర్మ్ విషయంపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటం, కరోనా మహమ్మారి విజృంభణ వంటి కారణాలతో ఎన్నికల ప్రక్రియ సాధ్యమవుతుందా అనే విషయం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
టీబీజీకేఎస్ వ్యతిరేకత..
సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నాలుగేండ్ల టర్మ్ నుంచి రెండేండ్లకు తగ్గిస్తూ కేంద్ర కార్మిక శాఖ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకెఎస్) కోర్టును ఆశ్రయించింది. నాలుగేండ్ల పాటు గుర్తింపు సంఘానికి అవకాశం కల్పించాలని, కార్మిక శాఖ తీసుకున్న నిర్ణయం సరైంది కాదదని టీబీజీకేఎస్ వాదిస్తున్నది. ఈ కేసుపై ఇంకా తుది తీర్పు వెలువడలేదు. అంతేకాకుండా ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా మహమ్మారి వల్ల ఎన్నికలు జరపడం సరైంది కాదన్న వాదన కూడా వారు వినిపిస్తున్నారు. ఈ వ్యాధి కారణంగా రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయన్న విషయాన్ని కూడా టీబీజీకెఎస్ ప్రస్తావిస్తోంది.
కార్మికుల్లో కరోనా టెన్షన్..
గుర్తింపు సంఘం ఎన్నికలు జరగాలంటే ప్రచారం కోసం సభలు, సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. గేట్ మీటింగ్‌లతో పాటు ప్రచారం కోసం గుంపు గుంపులుగా చేరాల్సిన పరిస్థితి తయారు కానుంది. అసలే కరోనా విస్తరిస్తున్న ఈ పరిస్థితుల్లో తమకు కరోనా సోకితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ ఆందోళన చేస్తున్నారు. బొగ్గు ఉత్పత్తి చేయాలంటే ఒకే చోట నలుగురైదుగురు కార్మికులు పనిచేయాల్సిన అవసరం ఉందని, దీని వల్ల కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని లాక్‌డౌన్ ప్రకటించాలన్న డిమాండ్ కూడా కార్మికులు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరపడం సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతున్నది.
కరోనా వ్యూహంతో ముందుకు..
రాష్ట్రంలోని పెద్దపల్లి, మంచిర్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లో సింగరేణి విస్తరించి ఉండగా ఈ సంస్థల్లో 45 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో వేలాది మందిని జమచేసి ప్రచారం చేస్తే కరోనా ప్రబలే అవకాశం ఉందనే వాదన లేవనెత్తి ముందుకు సాగుతుందని తెలుస్తున్నది. సింగరేణిలో ఎన్నికలు నిర్వహించడం ఇప్పుడున్న పరిస్థితులు అనుకూలంగా లేవని, గతంలో టర్మ్ విషయంలో కోర్టును ఆశ్రయించిన విషయంపై మరోసారి కోర్టును ఆశ్రయిస్తామని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల నడుమ సింగరేణి ఎన్నికలు నిర్వహిస్తారో లేదో వేచి చూడాల్సిందే.