కాపురం గుట్ట.. కరిగేను ఇట్టా!
దిశ, కరీంనగర్: కాకతీయ రాజుల చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచినవాటిలో కాపురం గుట్ట కూడా ఒకటి. ప్రస్తుతం ఆ ఆనవాళ్లను సమూలంగా తొలగించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కన్వేయర్ బెల్టు నిర్మాణం పేరుతో ఓ ప్రైవేటు సంస్థ దర్జాగా గుట్టను తొలుస్తున్నా అడ్డుకునే వారు కూడా లేకపోవడంతో చరిత్రాత్మకగుట్ట మరికొన్ని రోజుల్లో అంతర్థానం కానుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని కాపురం సమీపంలో చారిత్రాత్మకమైన గుట్ట ఉంది. ఖిలా వరంగల్ కేంద్రంగా పరిపాలించిన […]
దిశ, కరీంనగర్: కాకతీయ రాజుల చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచినవాటిలో కాపురం గుట్ట కూడా ఒకటి. ప్రస్తుతం ఆ ఆనవాళ్లను సమూలంగా తొలగించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కన్వేయర్ బెల్టు నిర్మాణం పేరుతో ఓ ప్రైవేటు సంస్థ దర్జాగా గుట్టను తొలుస్తున్నా అడ్డుకునే వారు కూడా లేకపోవడంతో చరిత్రాత్మకగుట్ట మరికొన్ని రోజుల్లో అంతర్థానం కానుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని కాపురం సమీపంలో చారిత్రాత్మకమైన గుట్ట ఉంది. ఖిలా వరంగల్ కేంద్రంగా పరిపాలించిన కాకతీయుల చివరి రాజు చిన ప్రతాపరుద్రుడు కాపురం గుట్టను షెల్టర్ జోన్‌గా ఉపయోగించుకున్నారని తెలుస్తోంది. రామగిరి ఖిల్లా ప్రాంతానికి వెళ్లి వచ్చేటప్పుడు ఈ గుట్టను సైన్యం డెన్‌గా వాడుకునేదని కూడా ప్రచారంలో ఉంది. కాకతీయుల కాలంలో నిర్మించిన అనేక చారిత్రక కట్టడాలకు నెలవైన ఈ గుట్టపై ఓ నిర్మాణ సంస్థ కన్నుపడింది.
తాడిచర్ల ఓపెన్ కాస్ట్ నుంచి చెల్పూరు కేటీపీపీ వరకు కన్వేయర్ బెల్ట్ నిర్మాణం చేపట్టేందుకు సీఎస్పీ అనే నిర్మాణ సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది. మైనింగ్ డిపార్ట్‌మెంట్ అనుమతి ఉన్న క్వారీల నుంచే ఈ నిర్మాణానికి అవసరమైన బండరాయిని సేకరించాల్సి ఉంటుంది. కానీ దూరప్రాంతం నుంచి తేవడం ఖర్చుతో కూడుకున్నదని భావించిన కాంట్రాక్టు సంస్థ బండరాయి కోసం కాపురం గుట్టను కెమికల్స్ ఉపయోగించి బ్లాస్టింగ్ చేస్తోంది. ఈ గుట్ట అటవీ భూములకు 390 మీటర్ల దూరంలో ఉండటంతో తమకు ఎలాంటి సంబంధం లేదని అటవీ అధికారులు చెబుతున్నారు. పురావస్తు శాఖ అధికారులు సైతం ఈ గుట్ట గురించి పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టు సంస్థ యథేచ్ఛగా తన పని కానిచ్చేస్తోంది.
గుప్త నిధులకు కేరాఫ్
రాజుల కాలంలో వినియోగించిన నగదు, ఆభరణాలను భూమిలో పాతిపెట్టే ఆనవాయితీ ఉండేది. కాకతీయులకు సైనిక స్థావరంగా ఉన్న కాపురం గుట్టలోనూ పెద్ద ఎత్తున గుప్త నిధులు ఉండే అవకాశం ఉంది. అయితే కన్వేయర్ బెల్ట్ నిర్మాణం కోసం ఈ గుట్టను పగులగొడుతుండటంతో కాకాతీయ రాజులు, వారి సంస్థానాధీశులు వినియోగించిన ఆభరణాలే కాకుండా బంగారు నాణేలు కూడా బయటపడే అవకాశాలున్నాయి. ఒకవేళ తవ్వకాల్లో నిజంగానే నిధులు బయటపడితే అవి ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదమూ లేకపోలేదు. ఇప్పటికైనా పురావస్తు శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కాపురం గుట్టను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.