భద్రాద్రి కొత్తగూడెంపై కమలం కన్ను
దిశ ప్రతినిధి, ఖమ్మం: కొత్తగూడెం జిల్లాలో కమలం వికసించనుందా..? అందుకు అనుకూలమైన పవనాలు వీస్తున్నాయా..? అంటే రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు నుంచి అవుననే సమాధానం వస్తోంది. కొత్తగూడెంలో కకావికలమైన కాంగ్రెస్.. కారులోని అంతర్గత పోరును ఆసరాగా చేసుకోవడంతో పాటు కొన్ని వర్గాలను దగ్గర చేసుకుంటే నియోజకవర్గంలో సొంతంగా ఎదిగేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయని కమలనాథులు అభిప్రాయ పడుతున్నారు నివేదికలో మూడు పేర్లు కాంగ్రెస్ కంచుకోటగా, వామపక్ష భావజలం అధికంగా ఉన్న నియోజకవర్గంగా పేరుగాంచిన కొత్తగూడెంలో కాషాయ జెండా […]
దిశ ప్రతినిధి, ఖమ్మం: కొత్తగూడెం జిల్లాలో కమలం వికసించనుందా..? అందుకు అనుకూలమైన పవనాలు వీస్తున్నాయా..? అంటే రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు నుంచి అవుననే సమాధానం వస్తోంది. కొత్తగూడెంలో కకావికలమైన కాంగ్రెస్.. కారులోని అంతర్గత పోరును ఆసరాగా చేసుకోవడంతో పాటు కొన్ని వర్గాలను దగ్గర చేసుకుంటే నియోజకవర్గంలో సొంతంగా ఎదిగేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయని కమలనాథులు అభిప్రాయ పడుతున్నారు
నివేదికలో మూడు పేర్లు
కాంగ్రెస్ కంచుకోటగా, వామపక్ష భావజలం అధికంగా ఉన్న నియోజకవర్గంగా పేరుగాంచిన కొత్తగూడెంలో కాషాయ జెండా రెపరెపలను బీజేపీ నేతలు ఊహిస్తుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పార్టీ ముఖ్య నేతలు మాత్రం ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్నపరిస్థితులు పార్టీకి పునాదులు పడటానికి.. ఎదగడానికి అవకాశాలుగా ఉన్నాయని చెబుతున్నారు. దీనిపై ఇటీవల రాష్ట్ర ముఖ్య నేతలు జాతీయ అధ్యక్షుడు నడ్డాకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో పార్టీ స్థితిగతులు, బలాబలాలు, సంస్థాగత ప్రయత్నాలు, ఫలితాలు వంటి అంశాలపై అంచనాలను జాతీయ నాయకత్వం రాష్ట్ర ముఖ్య నేతల నుంచి కోరినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే జిల్లాల్లో బీజేపీకి పుంజుకోవడానికి అవకాశం ఉన్న నియోజకవర్గాల పేర్లను ఈ జాబితాలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కొత్తగూడెం , భద్రాచలం, ఖమ్మం నియోజకవర్గాల పేర్లు ఉన్నట్లు సమాచారం. మిగతా రెండు నియోజకవర్గాల కన్నా.. కొత్తగూడెంలో త్వరితగతిన పార్టీ బలం పెంచుకోవడానికి అవకాశాలున్నాయని నొక్కి చెప్పినట్లు తెలిసింది.
కారులో ఆధిపత్య పోరు
గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి వనమా వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో వనమా గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే రాజకీయ తెరపై వనమా కనిపించినా.. వ్యూహాలన్నీ, పార్టీలో తిరుగులేకుండా చూసుకోవడం వంటి అంశాలన్నీ తనయుడు రాఘవనే చూసుకుంటున్నారన్నది జగమెరిగిన సత్యం. వనమా వయస్సు రీత్యా వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాలకు దూరంగా ఉంటారన్న చర్చ జరుగుతోంది. అయితే ఆ స్థానం నుంచి రాఘవనే మళ్లీ బరిలోకి దిగేందుకు కావాల్సిన రాజకీయ ఏర్పాట్లు, సొంతంగా బలం పెంచుకోవడం వంటి అంశాలపై దృష్టి పెట్టాడు. పార్టీలో జలగం వర్గీయుల నుంచి మాత్రం మధ్య మధ్యలో సెగ తగులుతూనే ఉంది. నియోజకవర్గంలో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయి పనిచేస్తుండటం గమనార్హం. ఇది ఆ పార్టీకి మైనస్‌గా మారనుందనేది వాస్తవం.
కాంగ్రెస్ వీక్..
కాంగ్రెస్ విషయానికి వస్తే కొత్తగూడెంలో పార్టీ దిక్కు దిశ లేకుండా ప్రయాణం సాగుతోంది. ఆ పార్టీ సమీప భవిష్యత్‌లో బలపడే అవకాశం లేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. వనమా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిపోవడంతో ఆయన అనుచరులతో పాటు చాలామంది కాంగ్రెస్ నేతలు కూడా గులాబీ కండువా కప్పేసుకున్నారు. ఇప్పుడు దీంతో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి నామమాత్రంగా మారింది. పార్టీ ఎన్నికల నాటికి మరింత తీసికట్టుగా మారుతుందన్న విశ్లేషణలు జరుగుతున్నాయి.
అవకాశంగా భావిస్తున్న కమలం..
కారులో వైషమ్యాలు..కాంగ్రెస్ వీక్‌నెస్‌ను.. బీజేపీ అవకాశంగా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈక్రమంలోనే జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని) ఆధ్వర్యంలో బీజేపీ స్వరం వినిపిస్తోంది. నియోజకవర్గంలో ప్రతిపక్ష పాత్ర లేని సమయంలో బీజేపీ ఆ బాధ్యతను ఎత్తుకున్నట్లుగా అనిపిస్తోంది. ఇదిలా ఉండగా నియోజకవర్గంలో పార్టీకి పాదులు పడాలంటే బలమైన నాయకత్వం కావాలని శ్రేణులు కోరుకుంటున్నారు. ఈనేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు కూడా ఇదే విషయాన్ని కొంతమంది నేతలు విన్నవించినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు రాజకీయ నేతలు కూడా ఈ నియోజకవర్గంపై కన్నేసి బీజేపీ నుంచి రాజకీయ ఉద్యమం మొదలుపెడితే ఫలితాలు వచ్చే అవకాశం లేకపోలేదని యోచిస్తున్నారంట. చూడాలి మరి కమలం కల… రాజకీయ నాయకుల స్వప్నం నెరవేరుతుందో లేదో మరి.