కేసీఆర్ పల్లకి మోస్తా : బండి సంజయ్

దిశ, తెలంగాణ బ్యూరో: బాప్ ఏక్ నంబర్ అయితే, ఆయన కొడుకు దస్ నంబర్ అని కేసీఆర్, కేటీఆర్‌లను ఉద్దేశించి బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అబద్ధాల్లో తండ్రిని మించిపోయాడని కేటీఆర్‌పై విమర్శలు చేశారు. 13 వేల కంపెనీలు, 1.32 లక్షల ఉద్యోగాల విషయంలో లెక్కలు సరైనవే అని నిరూపిస్తే టీఆర్ఎస్ పల్లకీ మోస్తానని, లేకుంటే ఆ పార్టీకి బడితపూజ తప్పదన్నారు. కేటీఆర్ ఇటీవల చేసిన తుపాకీ సైలెన్స్ గురించి చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసిన బండి […]

Update: 2021-03-07 12:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బాప్ ఏక్ నంబర్ అయితే, ఆయన కొడుకు దస్ నంబర్ అని కేసీఆర్, కేటీఆర్‌లను ఉద్దేశించి బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అబద్ధాల్లో తండ్రిని మించిపోయాడని కేటీఆర్‌పై విమర్శలు చేశారు. 13 వేల కంపెనీలు, 1.32 లక్షల ఉద్యోగాల విషయంలో లెక్కలు సరైనవే అని నిరూపిస్తే టీఆర్ఎస్ పల్లకీ మోస్తానని, లేకుంటే ఆ పార్టీకి బడితపూజ తప్పదన్నారు. కేటీఆర్ ఇటీవల చేసిన తుపాకీ సైలెన్స్ గురించి చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసిన బండి సంజయ్, కేసీఆర్ ఎప్పుడూ పడుకునే ఫాంహౌస్​లో తుపాకీ ఎప్పుడో తుప్పు పట్టిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నుంచే తాను రాజకీయ భాషను నేర్చుకున్నానని, ఆయన భాషలోనే కొన్నిసార్లు రిప్లై ఇవ్వాల్సి ఉంటుందని, దాన్ని గురుదక్షిణగానే భావిస్తానని అన్నారు. ఢిల్లీ వెళ్ళిన కేసీఆర్ వంగొంగి దండాలు పెట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో చేరుతున్నామంటూ అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్య పెడుతున్నారని, ఆరు నూరైనా టీఆర్ఎస్‌తో బీజేపీకి పొత్తు ఉండనే ఉండదన్నారు.

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉప్పల్‌లో జరిగిన సభలో బండి సంజయ్ మాట్లాడుతూ బ్రాహ్మణులమీద దాడులు జరిగితే ఏనాడూ స్పందించని కేసీఆర్ ఇప్పుడు వాణీదేవిని నిలబెట్టి ఓట్లు పొందాలనుకుంటున్నారని, ఆ పప్పులు ఉడకవన్నారు. బీజేపీ అభ్యర్థి ఎన్.రాంచందర్ వృత్తిరీత్యా న్యాయవాది కావడంతో టీఆర్ఎస్ సైతం న్యాయవాద సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు పెడుతోందని, కానీ లాయర్లమీద జరిగిన దాడులకు ఆ పార్టీ నేతలు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. బార్‌ల (మద్యం బార్లు)పై ఉన్న శ్రద్ధ బార్ కౌన్సిల్‌ పై లేదన్నారు.

జర్నలిస్టులంతా మానొళ్లే.. కానీ..

‘పాపం.. జర్నలిస్టులంతా మంచోళ్ళు. మనోళ్ళే. కానీ వారు పనిచేస్తున్న మీడియా యాజమాన్యాలు మాత్రం కేసీఆర్‌వి. అందుకే ఇంత కష్టపడి జర్నలిస్టులు వార్తలు రాస్తున్నా, నాలాంటివారు కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నా ఆ వార్తలు పత్రికల్లో రావు. కేసీఆర్‌కు వ్యతిరేక వార్తలు రాసే దమ్ము ఆ మీడియా యాజమాన్యాలకు లేదు’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రజల సంక్షేమం గురించి గొప్పలు చెప్పుకునే కేసీఆర్ కరోనా కాలంలో ఎక్కడకు పోయారని ప్రశ్నించారు. ఏనాడైనా ఆస్పత్రికి వెళ్ళి రోగులను పరామర్శించారా? వారి బాగోగులను తెలుసుకున్నారా? కనీసం కరోనా కారణంగా మరణించిన జర్నలిస్టు కుటుంబాలతోనైనా మాట్లాడారా? అని ఆయన నిలదీశారు. కరోనా లెక్కల్లో తప్పులున్నాయంటూ కోర్టులు మొట్టికాయలు వేసినా ప్రభుత్వానికి బుద్ధి రాలేని, ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్ యే బద్నాం అయ్యారన్నారు.

వైద్యారోగ్య రంగంపై చిత్తశుద్ధేదీ..

వైద్యారోగ్య రంగంపై కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని, వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీకి కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్లు ఇస్తే మ్యాచింగ్ గ్రాంట్‌గా రాష్ట్ర ప్రభుత్వం రూ.10 కోట్లు కూడా ఇవ్వలేదని, చివరకు ఆస్పత్రిలో అభివృద్ధి పనులకు విఘాతం కలిగిందన్నారు. కరోనా కష్టకాలంలో సొంత ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయక వైద్య సేవలందించిన డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బందికి కనీస సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించలేదన్నారు. కేంద్రం నుంచి నిధులు పొందుతున్నా ప్రధాని బొమ్మ పెట్టడానికి కేసీఆర్‌కు మనసు రావడంలేదన్నారు. కేంద్ర నిధులు లేకుండా కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏదో చెప్పాలని సవాల్​విసిరారు. రేషన్ బియ్యం, హరితహారం, డబుల్ బెడ్ రూమ్, రైతు వేదికలు, టాయిలెట్లు, రోడ్లు, లైట్లు, బస్తీ దవాఖానలు, స్మశానవాటికలు.. ఇలా అనేక పథకాలు కేంద్రం నిధులతోనే అమలు అవుతున్నాయని గుర్తుచేశారు. ఆయుష్మాన్ భారత్ విషయంలో సైతం తొలుత అమలుచేసేది లేదని భీష్మించుకున్న కేసీఆర్ విధిలేక ఇప్పుడు అమలు చేయడానికి సిద్ధమయ్యారని, ఇంతకాలం అమలు చేయని కారణంగా పేదలు ఇబ్బందులు పడ్డారన్నారు.

‘చెప్పు’కు ఓటు వేయరు..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని ప్రగతి భవన్‌లో కూర్చుని పార్టీ నేతలతో మీటింగులు పెడుతున్న కేసీఆర్ ఇప్పటివరకు ప్రజలను ఓటు వేయాలని కోరలేదని, ఇలాంటప్పుడు ఆ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని బండి సంజయ్ ప్రశ్నించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రేషన్లు డీలర్లు.. ఇలా అందరితో ఆత్మీయ సమ్మేళనాల పేరుతో మీటింగులు పెడుతున్న కేసీఆర్ చివరకు పీవీ నర్సింహారావు బొమ్మను కూడా ఎన్నికల్లో లబ్ధి కోసం వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి పదవిని ఎడమకాలి చెప్పుతో సమానమని వ్యాఖ్యానించి ఆ పదవికే కళంకం తెచ్చిన కేసీఆర్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా ఓటు వేస్తారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ‘చెప్పు’కు ఓటు వేయరని బండి సంజయ్ అన్నారు.

Tags:    

Similar News