దేవుడు లేని గుడిలా మారిన భూపాలపల్లి ఆస్పత్రి
దిశ, భూపాలపల్లి: పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించి, వారి ఆరోగ్యాన్ని కాపాడే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నప్పటికీ అది ఆచరణలో లేకపోవడంతో పేద ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రిలో రూ. లక్షలు పెట్టి వైద్యం చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ లక్ష్యం ఘనంగా ఉన్నప్పటికీ అది ఆచరణలో ఏ మాత్రం సాధ్యం కావడం లేదు. దీంతో మారుమూల గ్రామాల ప్రజలకు ప్రైవేట్ ఆస్పత్రిలే దిక్కవుతున్నాయి. ఏ చిన్న రోగం వచ్చినా ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి రూ. లక్షలు చెల్లించుకుంటున్నారు. […]
దిశ, భూపాలపల్లి: పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించి, వారి ఆరోగ్యాన్ని కాపాడే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నప్పటికీ అది ఆచరణలో లేకపోవడంతో పేద ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రిలో రూ. లక్షలు పెట్టి వైద్యం చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ లక్ష్యం ఘనంగా ఉన్నప్పటికీ అది ఆచరణలో ఏ మాత్రం సాధ్యం కావడం లేదు. దీంతో మారుమూల గ్రామాల ప్రజలకు ప్రైవేట్ ఆస్పత్రిలే దిక్కవుతున్నాయి. ఏ చిన్న రోగం వచ్చినా ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి రూ. లక్షలు చెల్లించుకుంటున్నారు. ఉన్న ఆస్తులు అమ్మి ఆస్పత్రులకు సమర్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వం 250 పడకల ఆస్పత్రి మంజూరు చేసి భవన నిర్మాణం చేసినప్పటికీ అందులో సౌకర్యాలు ఉన్నప్పటికీ సిబ్బంది లేకపోవడంతో ఆస్పత్రి ఏ మాత్రం జిల్లా వాసులకు ఉపయోగపడటం లేదు. రోగులు మాత్రం ఆస్పత్రి లో ఫుల్ గా ఉంటున్నారు తప్ప సిబ్బంది ఉండక సరైన వైద్యం అందక మధ్యలోనే ప్రైవేట్ ఆస్పత్రిలోకి వెళ్తున్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వం ఇటీవలనే 250 పడకల ఆస్పత్రిని మంజూరు చేసింది. దానికి తగ్గట్లుగానే కోట్ల రూపాయలతో భవన నిర్మాణం చేపట్టింది. ఆస్పత్రిలో రోగులకు అందించడానికి సరైన పరికరాలు సైతం ఓ ప్రైవేట్ సంస్థ సమకూర్చింది. ఇన్ని చేసినప్పటికీ ఆ ఆస్పత్రిలో రోగులకు వైద్యం చేసేందుకు సిబ్బంది మాత్రం కరువయ్యారు.
ప్రస్తుతం దేవుడు లేని గుడిలా భూపాలపల్లి ఆస్పత్రి పరిస్థితి మారింది. డాక్టర్లు లేక ఆస్పత్రి ఎందుకు ఏర్పాటు చేశారని జిల్లా వాసులు ప్రశ్నిస్తున్నారు. భూపాలపల్లి ఆస్పత్రి కరోనా కాలంలో కరోనా రోగులకు వైద్యం అందించేందుకు ఆ సమయంలో ఆస్పత్రి అనధికారికంగా ప్రారంభించారు. ఆస్పత్రిలో కరోనా రోగులకు వైద్యం అందించి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచారు. అనంతరం ఆ ఆస్పత్రి గురించి పట్టించుకోని అధికారులు, నాయకులు లేరు. ప్రస్తుతం భూపాలపల్లి ఆస్పత్రిని అధికారికంగా ప్రారంభించారా? లేదా ప్రభుత్వం తమ గొప్పల కోసం ఆస్పత్రిని నిర్మించిందా ? అనే సందిగ్ధంలో ఈ ప్రాంతవాసులు ఉన్నారు. ప్రస్తుతం భూపాలపల్లి ఆస్పత్రి కలెక్టర్ ప్రత్యేక నిధులతో నియమించిన సిబ్బందితో నిర్వహిస్తున్నారు. ఆస్పత్రిలో ప్రభుత్వంచే రెగ్యులర్ గా నియమించబడిన డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది లేరు. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది అంతా కాంట్రాక్ట్ బేసిక్, అవుట్ సోర్సింగ్ విధానంలో రిక్రూట్ చేసుకుని, వారిచే పని చేయిస్తున్నారు తప్ప రెగ్యులర్ గా నియమించలేదు. జిల్లాలోని చిట్యాల ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తిరుపతి ద్వారానే ఈ ఆస్పత్రి నిర్వహించబడుతుంది. ప్రజలకు ఎంతో కొంత వైద్యం అందించాలనే ఉద్దేశంతో చిట్యాల డాక్టర్ తిరుపతి స్థానికంగా ఆస్పత్రిలో మందులు లేకున్నా చిట్యాల, మహదేవ్ పూర్ సివిల్ ఆసుపత్రులకు మంజూరైన మందుల ద్వారా రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. అత్యవసర మందులు అవసరమైతే వరంగల్ నుండి తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ఆస్పత్రిలో సరైన వైద్యం అందక ఆస్పత్రికి వచ్చే రోగులు రోజురోజుకు తక్కువ అవుతున్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న 250 పడకల ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యం అందించాలంటే 50 మంది డాక్టర్లు, సుమారు 70 మంది నర్సులు, వారితోపాటు సుమారు 100 మంది పారా మెడికల్ సిబ్బంది అవసరం. ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న ఆస్పత్రి అలంకారప్రాయంగా నిలిచింది.
నిర్మాణమైనా ప్రారంభంకాని ఆస్పత్రి
భూపాలపల్లిలోని 250 పడకల ఆస్పత్రి భవనం నిర్మాణం పూర్తి అయ్యి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ అధికారికంగా ప్రారంభించలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించే సమయంలో ఆస్పత్రిని ప్రారంభించే సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి జిల్లా కేంద్రానికి రావడానికి టైం ఇచ్చేది ఎన్నడూ ఆస్పత్రి ప్రారంభమయ్యేది ఎన్నడూ అని జిల్లా వాసులు ఎదురు చూస్తున్నారు. ఆస్పత్రి అధికారికంగా ప్రారంభిస్తే అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉంది. సుమారు 200 మందికి పైగా సిబ్బంది ఈ ఆస్పత్రిలో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం అందులో పనిచేసేవారికి కలెక్టర్ నిధులతో జీతభత్యాలు చెల్లిస్తున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వమే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాకు దిక్కెవరూ? అని ఈ ప్రాంత వాసులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి స్పందించి ఆస్పత్రిని అధికారికంగా ప్రారంభమయ్యేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వర్షాకాలం వస్తే నీటిలోనే ఆస్పత్రి
కాగా ప్రస్తుతం నిర్మించిన 250 పడకల ఆస్పత్రి వర్షాకాలం వస్తే నీటిలోనే ఉండవలసిన పరిస్థితి ఉంది. ఆస్పత్రిని పూర్తిగా లోతట్టు ప్రాంతంలో నిర్మించడంతో వర్షం రాగానే వరద నీరంతా ఆస్పత్రి చుట్టే నిలిచిపోతుంది. దీంతో రోగులు ఆస్పత్రి వెళ్లడానికి సైతం దారి ఉండదు. వర్షాలు కురిసిన తరువాత మూడు రోజులపాటు ఆస్పత్రి ఆవరణ బురదమయంతో నిండి పోతుంది. ఈ విషయం గత రెండు సంవత్సరాలుగా కురిసిన భారీ వర్షాల వల్ల అధికారులకు తేటతెల్లం అయితున్నప్పటికీ అందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం లేదు. ఆస్పత్రి ఆవరణలోకి నీరు రాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.