గత ప్రభుత్వం కట్టించిన ఇళ్లు ఎందుకివ్వరు?

దిశ, ఏపీ బ్యూరో : “మేం చేసిన తప్పేంటి సార్! గత ప్రభుత్వం ఇళ్లు కట్టిస్తే తీసుకోకుడదా! మరి మేం కట్టిన డబ్బు సంగతేంటి. ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. తినోతినకో దాచుకున్న సొమ్ము కట్టాం.. నిర్మించిన ఇళ్లు ఇవ్వడానికి వీళ్లకు చేతులు రావడం లేదు. ఈ ప్రభుత్వం మమ్మల్ని మానసికంగా చంపేస్తోంది. పదిరోజుల్లోగా ఇవ్వకుంటే మేమే వెళ్లి ఆక్రమిస్తాం” అంటూ నెల్లూరు నగరంలో టిడ్కో ఇళ్ల లబ్దిదారులు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. […]

Update: 2020-10-16 10:08 GMT
గత ప్రభుత్వం కట్టించిన ఇళ్లు ఎందుకివ్వరు?
  • whatsapp icon

దిశ, ఏపీ బ్యూరో : “మేం చేసిన తప్పేంటి సార్! గత ప్రభుత్వం ఇళ్లు కట్టిస్తే తీసుకోకుడదా! మరి మేం కట్టిన డబ్బు సంగతేంటి. ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. తినోతినకో దాచుకున్న సొమ్ము కట్టాం.. నిర్మించిన ఇళ్లు ఇవ్వడానికి వీళ్లకు చేతులు రావడం లేదు. ఈ ప్రభుత్వం మమ్మల్ని మానసికంగా చంపేస్తోంది. పదిరోజుల్లోగా ఇవ్వకుంటే మేమే వెళ్లి ఆక్రమిస్తాం” అంటూ నెల్లూరు నగరంలో టిడ్కో ఇళ్ల లబ్దిదారులు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. శుక్రవారం వేల మంది లబ్దిదారులు గృహ సముదాయం వద్దకు ప్రదర్శనగా వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపైనే పాలు పొంగించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కట్టిన ఇళ్లను స్వాధీనం చేసుకుంటామని వారికి నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర పౌర సమాఖ్య కన్వీనర్ చిగురుపాటి బాబూరావు హెచ్చరించారు.

నెల్లూరు నగరంలోని జనార్ధనరెడ్డి కాలనీలో గత ప్రభుత్వం 175 అపార్టుమెంట్లు నిర్మించింది. మొత్తం 4,800 మందికి ప్లాట్లు కేటాయించారు. నిర్మాణం పూర్తి చేసి ఇంటి తాళాలు కూడా చేతికిచ్చారు. కానీ ఆ గృహ సముదాయాలకు నీటి సదుపాయం కల్పించలేదు. అదొక్కటే పెండింగున్నా లబ్దిదారులు గృహ ప్రవేశాలకు సిద్ధమయ్యారు. కానీ వైసీపీ ప్రభుత్వం వారిని అడ్డుకుంది. దాదాపు 17 నెలల నుంచి వాళ్లు చెయ్యని ఆందోళన లేదు. కలవని ప్రజాప్రతినిధి లేడు. అయినా గృహ ప్రవేశాలకు మోక్షం కలగలేదు. ఈలోగా ఇంటికి రుణం ఇచ్చిన బ్యాంకులు వాయిదా సొమ్ము చెల్లించాలని నోటీసులు ఇచ్చాయి. ఓవైపు కట్టిన ఇల్లు చేతికి రాలేదు. మరోవైపు కరోనా లాక్డౌన్తో పనుల్లేక అల్లాడిపోయారు. ఇప్పుడు ఇంటి అద్దెలు చెల్లించడానికే అవస్థలు పడుతుంటే బ్యాంకుల నోటీసులు, ప్రభుత్వం ఇళ్లను స్వాధీనం చేయకపోవడం వాళ్ల తీవ్ర నిరసనకు కారణమైంది.

మొన్నామధ్య సీపీఐ నారాయణ ఇదే అంశంపై ప్రకటన చేశారు. రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం కూడా పేదలకు కట్టించిన ఇళ్లు ఇవ్వకపోవడంపై స్పందించింది. ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ పెద్దలు కనీసం స్పందించ లేదు. ఇస్తామనో లేక ఇవ్వడం కుదరదనో చెప్పడం లేదు. లేక అన్నీ ఇళ్లు నిర్మించాక ఇస్తామనో ఏదో ఒకటి చెప్పాలి. కానీ నోరు మెదపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మౌనం వెనుక కేంద్ర నిర్ణయం ఉందనే ప్రచారం జరుగుతోంది. వలస కూలీల కోసం కేంద్రం తాత్కాలిక నివాసాలు నిర్మించి ఇస్తామని హామీనిచ్చింది. ప్రస్తుతం టిడ్కో నిర్మించినవి, నిర్మాణంలో ఉన్నవి అందుకోసం కేటాయిస్తారనే భావం డబ్బు కట్టిన లబ్దిదారుల్లో నెలకొంది. అందుకే ఆందోళన బాట పట్టినట్లు తెలుస్తోంది.

గత ప్రభుత్వ హయాంలో పీఎంఏవై కింద టిడ్కో ద్వారా అపార్టుమెంటు తరహాలో వివిధ కేటగిరీల కింద 3,13,832 గృహాల నిర్మాణం చేపట్టింది. అందులో 79,184 ఇళ్లు పూర్తి చేసింది.మరో 1,23,832 ఇళ్ల నిర్మాణం పునాదుల దశలో ఉన్నాయి. ఇవి పూర్తి కావాలంటే టిడ్కోకు రూ.13,500 కోట్లు కావాలి. లబ్దిదారుల వాటా కింద రూ. 2వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో 300 చదరపు గజాల కేటగిరీ కింద లబ్దిదారులు రూ.5,072 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.94 కోట్లు మాత్రమే చెల్లించారు. 365 చదరపు గజాల కేటగిరీలో రూ.1617 కోట్లకుగాను రూ.300 కోట్లు కట్టారు. 430 చదరపు గజాల కేటగిరీలో రూ.3,455.51 కోట్లకు రూ.450 కోట్లే తమ వాటాగా చెల్లించారు. అప్పట్లో ప్రభుత్వంపై వైసీపీ పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేసింది. చదరపు గజానికి తెలంగాణ ప్రభుత్వం రూ.1200 లోపు చెల్లిస్తుంటే ఇక్కడ ప్రభుత్వం రూ. రెండు వేలకు పైగా నిర్మాణ కంపెనీలతో ఒప్పందం చేసుకుందని దుమ్మెత్తి పోసింది.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక రివర్స్ టెండరింగ్ కోసం ఆయా కంపెనీలకు నోటీసులిచ్చింది. ఈ ప్రక్రియ ద్వారా కొత్త కంపెనీలకు నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. తద్వారా రూ.1800 కోట్లకు పైగా ప్రభుత్వానికి మిగిలినట్టు తెలిపింది. అక్కడ నుంచి లబ్ది దారుల్లో అనర్హులున్నారంటూ ఏరివేత కార్యక్రమం చేపట్టింది. అనర్హులకు తిరిగి వాళ్ల సొమ్ము తిరిగి ఇచ్చేసి జాబితా నుంచి తొలగించాలి. ఇప్పటికీ ఆ పని చెయ్యలేదు. పూర్తయిన ఇళ్లను అర్హలైన లబ్దిదారులకు ఇవ్వడం లేదు. అసలు ఎవరు అర్హులో ఎవరు అనర్హులో తేల్చలేదు. పెండింగులో ఉన్న నిర్మాణాలకు సంబంధించి టిడ్కోకు నిధులు ఇవ్వడం లేదు. వీటన్నింటినీ పక్కన పెట్టి రాష్ట్రంలో 25 లక్షలకు పైగా ఇళ్లు లేని పేదలకు స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆధునిక టెక్నాలజీతో ఇండిపెండెంట్ ఇళ్లు నిర్మించడానికి కసరత్తు చేస్తోంది. కోర్టు వివాదాల కారణంగా ఆ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం కొత్తగా నిర్మించి ఇచ్చే ఇళ్ల సంగతి పక్కన పెట్టి ఈపాటికే కట్టిన ఇళ్లకు సంబంధించి ఓస్పష్టతనివ్వాలి. లబ్దిదారుల ఆందోళనకు తెరదించాలి.

పదిరోజుల్లో సమస్యను పరిష్కరిస్తామన్నారు : సింహపురి పౌర సమాఖ్య నేత శ్రీనివాసులు

పది రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్నుంచి సమాచారం వచ్చింది. కానీ ఇది కేవలం ఒక్క జనార్దన రెడ్డి కాలనీ సమస్య ఒక్కటే కాదు. ఇంకా నగరంలో చాలా చోట్ల నిర్మాణం పూర్తయినవి ఉన్నాయి. కొన్ని ఇంకా నిర్మాణం కొనసాగుతున్నాయి. వీటన్నింటిపై ప్రభుత్వం ఓ స్పష్టతనివ్వాలి. ఎప్పుడిస్తారనేది ప్రకటించాలి. జాప్యానికి కారణమేంటో చెప్పాలి. లబ్దిదారుల్లో ఆందోళనను తొలగించాలి.

Tags:    

Similar News