ఐపీఎల్ కోసం బయోబబుల్ స్టేడియాలు

దిశ, స్పోర్ట్స్: రెండు జట్లతో ఇంగ్లాండ్-వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) చేసిన ప్రయోగాన్ని ఇప్పుడు 8 జట్లతో బీసీసీఐ చేయాల్సి ఉంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆటను ప్రారంభించడానికి ఈసీబీ బయోబబుల్ వాతావరణ సృష్టించి ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య టెస్టు సిరీస్ నిర్వహించింది. 40మంది ఆటగాళ్లను పూర్తిగా బయో సెక్యూర్ వాతావరణంలో ఉంచి సిరీస్‌ను విజయవంతం చేసింది. ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం బీసీసీఐ చాలా పెద్ద కసరత్తే చేయాల్సి ఉంది. ఒక్కో ఫ్రాంచైజీలోనే […]

Update: 2020-07-30 07:36 GMT

దిశ, స్పోర్ట్స్: రెండు జట్లతో ఇంగ్లాండ్-వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) చేసిన ప్రయోగాన్ని ఇప్పుడు 8 జట్లతో బీసీసీఐ చేయాల్సి ఉంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆటను ప్రారంభించడానికి ఈసీబీ బయోబబుల్ వాతావరణ సృష్టించి ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య టెస్టు సిరీస్ నిర్వహించింది. 40మంది ఆటగాళ్లను పూర్తిగా బయో సెక్యూర్ వాతావరణంలో ఉంచి సిరీస్‌ను విజయవంతం చేసింది. ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం బీసీసీఐ చాలా పెద్ద కసరత్తే చేయాల్సి ఉంది. ఒక్కో ఫ్రాంచైజీలోనే 40మంది ఆటగాళ్లు, సిబ్బంది ఉంటారు. అలాంటి ఎనిమిది టీమ్‌లను పూర్తిగా బయో సెక్యూర్ వాతావరణంలోకి తీసుకొని పోవడం కష్టమే. కానీ దీన్ని సుసాధ్యం చేసి ఈ ఏడాది ఐపీఎల్‌ను విజయవంతం చేయడానికి బీసీసీఐ ఇప్పుడు ఈసీబీ సలహాలను తీసుకుంటున్నది. బీసీసీఐ తాత్కాలిక సీఈవో హేమంత్ అమిన్ ఇప్పటికే ఈ విషయమై ఈసీబీ అధికారులను సంప్రదించారు. ఈసీబీ రెండు వేదికల్లో బయోబబుల్ వాతావరణాన్ని ఎలా సృష్టించిందో అడిగి తెలుసుకుంటున్నారు. దీనికి సంబంధించిన స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ) ఏమిటో తెలుసుకొని యూఏఈలోని మూడు స్టేడియాల్లో అమలు చేయనున్నారు.

ఐఎంజీతో కలిసి..

ఈసీబీ ఇచ్చిన సలహాలతో యూఏఈలోని మూడు స్టేడియాల్లో ప్రొడక్షన్ భాగస్వామి అయిన ఇంటర్నేషనల్ మేనేజ్‌మెంట్ గ్రూప్ (ఐఎంజీ)తో కలిసి బీసీసీఐ బయోబబుల్ సృష్టించనుంది. దుబాయ్‌లోని ఐసీసీ క్రికెట్ అకాడమీ గ్రౌండ్, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియాలలో మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. ఈసీబీ సృష్టించిన బయోబబుల్‌కు ఐపీఎల్ కోసం బీసీసీఐ సృష్టించబోయే బయోబబుల్‌కు చాలా తేడా ఉండనుంది. ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ నగరంలో ఉన్న మైదానం, మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానాలను ఆనుకొనే స్టార్ హోటల్స్ ఉన్నాయి. దీంతో ఆటగాళ్లు, సిబ్బంది, బ్రాడ్‌కాస్ట్ సిబ్బంది, అంపైర్లు, కోచ్‌లకు ఈసీబీనే పూర్తిగా బయోబబుల్ ఏర్పాటు చేసింది. కానీ, బీసీసీఐ మాత్రం స్టేడియాలలోనే బయో సెక్యూర్ వాతావరణం సృష్టిస్తుంది. ఆటగాళ్లు, సిబ్బందికి సంబంధించిన బాధ్యత మాత్రం ఆయా ఫ్రాంచైజీలే తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రోటోకాల్స్ మాత్రమే బీసీసీఐ అందిస్తుంది. శిక్షణ శిబిరం నుంచి ఐపీఎల్ ముగిసే వరకు ఆటగాళ్లకు సంబంధించిన పూర్తి బాధ్యత ఆయా ఫ్రాంచైజీలే తీసుకోవాల్సి ఉంది.

అగస్టు 2న ఐపీఎల్ జీసీ సమావేశం

ఐపీఎల్‌కు సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్‌వోపీ) నిబంధనలు ఆగస్టు 2న జరిగే గవర్నింగ్ బాడీ సమావేశంలో ఖరారు చేయనున్నారు. ఇప్పటికే అందుతున్న సమాచారాన్ని బట్టి, ప్రతి ఆటగాడు నాలుగు సార్లు కొవిడ్ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇండియా నుంచి బయల్దేరే ముందు ఆటగాళ్లకు రెండు సార్లు కరోనా పరీక్షలు టెస్టులు నిర్వహిస్తారు. రెండింటిలోనూ నెగెటివ్ వస్తేనే సదరు ఆటగాడిని యూఏఈ తీసుకొళ్తారు. ఇక యూఏఈ చేరుకున్న తర్వాత మరోసారి, శిక్షణ శిబిరం జరిగే సమయంలో ఇంకోసారి టెస్టులు చేయాలని బీసీసీఐ చెబుతున్నది. ఇలా మొత్తం నాలుగు టెస్టుల్లో నెగెటివ్ వస్తేనే వాళ్లు ఐపీఎల్ ఆడటానికి అర్హులు. ఆట జరిగే సమయంలో డ్రెస్సింగ్ రూంలో సైతం చాలా తక్కువ మంది ఆటగాళ్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఐపీఎల్ కోసం సృష్టించబోయే బయోబబుల్ వాతావరణంలోకి అన్ని టెస్టులు పూర్తయ్యాకే డ్రైవర్లు, వంటవాళ్లు, గ్రౌండ్ సిబ్బంది, ఐపీఎల్ యాజమాన్యం, ఫ్రాంచైజీ యాజమాన్యం, బీసీసీఐ అధికారులను అనుమతిస్తారు. ఒకసారి వాళ్లు బయోసెక్యూర్ పరిధిలోకి వెళ్లాక, తిరిగి బయటకు వచ్చే వీలుండదు. మరీ ఇన్ని నిబంధనల మధ్య ఐపీఎల్‌ను విజయవంతం చేయడం బీసీసీఐకి కత్తిమీద సామే.

Tags:    

Similar News