క్రికెట్ క్యాలెండర్‌పై బీసీసీఐ మల్లగుల్లాలు..!
దిశ, స్పోర్ట్స్ : కరోనా వైరస్ క్రికెట్ ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపేసింది. దేశవాళీ నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు మ్యాచ్‌లన్నీ నిలిచిపోయాయి. ఆదాయం లేక పలు దేశాల క్రికెట్ బోర్డులు.. క్రికెటర్లు, సిబ్బందికి వేతనాలు చెల్లించే పరిస్థితిలో లేవు. బీసీసీఐ మాత్రం ప్రస్తుతం ఉన్న నిధులతో జీతభత్యాలు చెల్లించగలిగింది. అయితే పలు రాష్ట్రాల అసోసియేషన్లకు ఆదాయ వనరుగా ఉన్న ఐపీఎల్ వాయిదా పడటంతో అవన్నీ బీసీసీఐ నిధుల కోసం వేచి చూస్తున్నాయి. క్రీడా మైదానాల నిర్వహణ, […]
దిశ, స్పోర్ట్స్ : కరోనా వైరస్ క్రికెట్ ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపేసింది. దేశవాళీ నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు మ్యాచ్‌లన్నీ నిలిచిపోయాయి. ఆదాయం లేక పలు దేశాల క్రికెట్ బోర్డులు.. క్రికెటర్లు, సిబ్బందికి వేతనాలు చెల్లించే పరిస్థితిలో లేవు. బీసీసీఐ మాత్రం ప్రస్తుతం ఉన్న నిధులతో జీతభత్యాలు చెల్లించగలిగింది. అయితే పలు రాష్ట్రాల అసోసియేషన్లకు ఆదాయ వనరుగా ఉన్న ఐపీఎల్ వాయిదా పడటంతో అవన్నీ బీసీసీఐ నిధుల కోసం వేచి చూస్తున్నాయి. క్రీడా మైదానాల నిర్వహణ, సిబ్బంది, కార్మికుల జీతభత్యాలకు కూడా నిధులు లేకపోవడంతో బీసీసీఐకి పలు విజ్ఞప్తులు చేస్తున్నాయి. కానీ, క్రికెట్ పూర్తిగా స్తంభించిపోవడంతో ఆదాయం రావడం లేదని బీసీసీఐ చెబుతోంది.
క్రికెట్ షెడ్యూల్.. కరోనా వైరస్ కారణంగా చిన్నాభిన్నం కావడంతో తదుపరిగా ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేయలేదని బీసీసీఐ ఆపరేషనల్ జనరల్ మేనేజర్ సబా కరీం వెల్లడించారు. సాధారణంగా ఇండియాలో క్రికెట్ సీజన్ అగస్టులో ప్రారంభం అవుతుంది. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఇరానీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ షెడ్యూల్ కూడా ముందుగానే నిర్ణయిస్తారు. కానీ ఇప్పుడు అన్ని ఫార్మాట్లలోనూ క్రికెట్‌కు బ్రేక్ పడటంతో ప్రత్యామ్నాయ ప్రణాళికపై మల్లగుల్లాలు పడుతోంది. సెప్టెంబర్-అక్టోబర్‌లో ఐపీఎల్ నిర్వహిస్తే దేశవాళీ షెడ్యూల్‌కు ఆటంకం కలిగే అవకాశం ఉంది. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఫార్ములాను అనుసరించాలని బోర్డు నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ఐపీఎల్ జరిగినా అదే సమయంలో దేశవాళీ క్రికెట్‌ను ఆపొద్దని భావిస్తున్నారు. ఐపీఎల్‌లో ఆడే దేశవాళీ క్రికెటర్లకు అనుమతిచ్చి.. మిగిలిన వారితో రంజీ ట్రోఫీని నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ఈ సీజన్‌లో మిగిలిన సమయాన్ని క్రోఢీకరించి క్రికెట్ క్యాలెండర్ సిద్ధం చేయాలని బోర్డు అనుకుంటోంది.
గత సీజన్‌లో పురుషులు, మహిళలకు కలిపి 2,035 దేశవాళీ మ్యాచులను బోర్డు నిర్వహించింది. వీటిలో 470 మ్యాచులు సీనియర్ కేటగిరీకి చెందినవే. ప్రస్తుత సీజన్‌లోనూ అన్ని మ్యాచులు నిర్వహించడం కష్టమే. కాబట్టి మ్యాచులను కుదించి, అన్ని జట్లకు సమాన అవకాశాలు ఉండేలా క్యాలెండర్ సిద్ధం చేయడం ప్రస్తుతం బీసీసీఐకి తలకు మించిన భారం కానుంది. అదే సమయంలో ఐపీఎల్ నిర్వహణపైనా మరో సారి పునఃసమీక్షించాల్సి ఉంది. అయితే, ఏది జరగాలన్నా కరోనా సంక్షోభం ముగియాల్సిందేనని సీనియర్ బోర్డు సభ్యుడొకరు వ్యాఖ్యానించడం గమనార్హం.
Tags : BCCI, Cricket, Domestic Cricket, Ranji Trophy, IPL, Saba Kareem, Coronavirus