తెలంగాణలో మరో రాజకీయ వారసురాలు ఎంట్రీ?

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో మరో రాజకీయ వారసురాలు రంగప్రవేశం చేయబోతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా దూసుకు వస్తోంది. ఓ వైపు సామాజిక కార్యక్రమాలు, మరోవైపు పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడుతోంది. తండ్రికి వారసురాలిగా ప్రజల్లోకి చొచ్చుకుపోతుంది. ఇంతకూ ఎవరా మహిళా నేత అనుకుంటున్నారా..? ఆమె పేరు చెబితే అంతగా గుర్తుపట్టడం కష్టం కానీ ఆమె తండ్రి పేరు చెబితే ఇట్టే గుర్తు పట్టేస్తాం.. రండి ఆమె గురించి తెలుసుకుందాం.. బండారు […]

Update: 2021-03-04 22:52 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో మరో రాజకీయ వారసురాలు రంగప్రవేశం చేయబోతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా దూసుకు వస్తోంది. ఓ వైపు సామాజిక కార్యక్రమాలు, మరోవైపు పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడుతోంది. తండ్రికి వారసురాలిగా ప్రజల్లోకి చొచ్చుకుపోతుంది. ఇంతకూ ఎవరా మహిళా నేత అనుకుంటున్నారా..? ఆమె పేరు చెబితే అంతగా గుర్తుపట్టడం కష్టం కానీ ఆమె తండ్రి పేరు చెబితే ఇట్టే గుర్తు పట్టేస్తాం.. రండి ఆమె గురించి తెలుసుకుందాం..

బండారు దత్తాత్రేయ. ఈ పేరు తెలియని తెలుగు వారుండరు. బీజేపీ సీనియర్ నాయకుడిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, గవర్నర్‌గా సుపరిచితులు. ప్రస్తుతం ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. ఆయనకు ఇద్దరు సంతానం. కుమారుడు వైష్ణవ్, కూతురు విజయలక్ష్మి. ఎంబీబీఎస్ చదువుతున్న వైష్ణవ్ మూడేళ్ల క్రితం గుండెపోటుతో మరణించారు. కూతురు విజయ లక్ష్మికి వివాహం అయినప్పట్టికీ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటుంది. ఆయనకు రాజకీయ వారసురాలిగా ఎదగాలని కోరుకుంటుంది. దీనికి తండ్రి దత్తాత్రేయ ఆశీసులు కూడా ఉన్నాయి. బీజేపీ సైతం ఆమెను రాజకీయాల్లోకి తీసుకురావాలని చూస్తోంది.

వైష్ణవ్ అకాలమృతి తర్వాత విజయలక్ష్మి.. సోదరుడికి గుర్తుగా ఆయన పేరుపై చారిటబుల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. దాని ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కరోనా సమయంలో ఎంతోమంది అనాథలు, అభాగ్యులను ఆ ట్రస్ట్ ద్వారా ఆదుకుంది. సాయం కోసం వచ్చిన ఆపన్నులను ఆదుకుంటుంది. ఇలా సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్న ఆమెను పార్టీ నాయకులు గుర్తించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ల తరుఫున ప్రచారానికి దింపారు. ఆమె వాక్చాతుర్యం అటు ప్రజలను, ఇటు బీజేపీ నాయకులను ఆకట్టుకుంది. దీంతో ఆమెను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఒకస్థానం నుంచి ఎమ్మెల్యేగా బరిలో దింపాలని రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తోందట. తండ్రి దత్తాత్రేయ సైతం తన వారసురాలిగా ప్రకటించి, ఎమ్మెల్యేగా గెలిపించాలని పట్టుదలగా ఉన్నారట. దీనికోసం జాతీయ నాయకత్వంతో కూడా ఆయన చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది.

విజయలక్ష్మి మాటతీరు, చాతుర్యం ఆమెను రాజకీయల్లో రాణించేలా చేస్తాయని బీజేపీ భావిస్తోంది. మరోవైపు ఆమెలో పేదల పక్షాన పోరాడే పటిమ ఉందని గుర్తించింది. ఇప్పటికే ఆమె పలు సామాజిక కార్యక్రమాలను చేస్తూ ప్రజలను, క్రీడాపోటీలు నిర్వహిస్తూ యువతను ఆకర్షించారు. జీహెచ్ఎంసీలో ఆమె ప్రచారం చేసిన డివిజన్లలో అభ్యర్థులు విజయ కేతనం ఎగురవేశారు. ఇవన్నీ ఆమెకు ఫ్లస్ పాయంట్స్ గా బీజేపీ భావిస్తోంది. అయితే ఆమె రాజకీయ రంగప్రవేశం అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారన్నది తెలియాల్సి ఉన్నది. ఆమె అభిమానులు, కార్యకర్తలు మాత్రం సికింద్రాబాద్ నుంచి గెలిపించుకోవాలని ఉవ్విళ్లు ఊగుతున్నారు.

Tags:    

Similar News