త్యాగానికి ప్రతీక బక్రీద్.. ‘దిశ’ ప్రత్యేక కథనం మీకోసం..!
దిశ, చార్మినార్ : ముస్లింలు త్యాగానికి ప్రతీకగా బక్రీద్ (ఈదుల్ జుహా) పండుగ జరుపుకుంటారు. ఈ నెల 21వ తేదీన బక్రీద్ పండుగ జరుపుకోవడానికి ముస్లిం సోదరులు సిద్దమవుతున్నారు. బక్రీద్ పండుగ రోజున జరిగే సామూహిక నమాజ్‌ల కోసం నగరంలోని ఈద్గాలు, మసీదులు సుందరంగా అలంకరించారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగను ‘ఈదుల్ జుహా’ అని కూడా అంటారు. బక్రీద్ రోజున ప్రార్ధనల ద్వారా జంతువులను బలి ఇవ్వడం ఆచారంగా వస్తుంది. ఈ పండుగను ముస్లింలు […]
దిశ, చార్మినార్ : ముస్లింలు త్యాగానికి ప్రతీకగా బక్రీద్ (ఈదుల్ జుహా) పండుగ జరుపుకుంటారు. ఈ నెల 21వ తేదీన బక్రీద్ పండుగ జరుపుకోవడానికి ముస్లిం సోదరులు సిద్దమవుతున్నారు. బక్రీద్ పండుగ రోజున జరిగే సామూహిక నమాజ్‌ల కోసం నగరంలోని ఈద్గాలు, మసీదులు సుందరంగా అలంకరించారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగను ‘ఈదుల్ జుహా’ అని కూడా అంటారు. బక్రీద్ రోజున ప్రార్ధనల ద్వారా జంతువులను బలి ఇవ్వడం ఆచారంగా వస్తుంది. ఈ పండుగను ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.
బక్రీద్ పండుగ రోజున శివారు ప్రాంతాలలోని ఈద్గాలలో సామూహిక ప్రార్థనలు చేస్తారు. కూలీకుతుబ్ షాల కాలంలో మాదన్న పేట్‌లోని ఈద్గాలలో ప్రార్థనలు జరుపుకునే వారు. మూడో నిజాం మీర్ అక్బర్ అలీఖాన్ సికిందర్ జా టైంలో మీరాలం చెరువు సమీపంలో విశాలమైన ఈద్గాను నిర్మించారు. ముస్లింలు రంజాన్ , బక్రీద్ పండుగ సమయాలలో సామూహిక ప్రార్థనలు జరుపుకునేందుకు చెరువు గట్టున 40 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈద్గానే మీరాలం ఈద్గా అంటారు. ప్రార్థనల కోసం వేలాదిగా తరలి వచ్చే ముస్లిం సోదరుల కోసం టెంట్‌లు ఏర్పాట్లు చేస్తుంటారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా దక్షిణ మండల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తుంటారు.
త్యాగానికి ప్రతీకే బక్రీద్ చరిత్ర ..
దైవ ప్రవక్తలలో ఒకరైన హజ్రత్ ఇబ్రహీం (ఆలై) తన ప్రియ తనయుడైన హజ్రత్ ఇస్మాయిల్( ఆలై)ల త్యాగ నిరతిని స్మరించుకుంటూ జరుపుకునే పండుగే బక్రీద్. హజ్రత్ ఇబ్రహీం(ఆలై)కు వృద్దాప్యంలో కలిగిన సంతానమే హజ్రత్ ఇస్మాయిల్( ఆలై). ఒకరోజు హజ్రత్ ఇబ్రహీం (ఆలై) ఏకైక కుమారుడైన హజ్రత్ ఇస్మాయిల్( ఆలై)ను దేవుని మార్గంలో బలిచేస్తున్నట్లు కలగన్నాడు. ఈ స్వప్నాన్ని దేవుని తరపున ఓ సంకేతంగా తలచి ఆయన తన ముద్దుల కుమారున్ని దైవ మార్గంలో త్యాగం చేయాలన్న దృఢ సంకల్పంతో తండ్రి విషయాన్ని కుమారుడికి చెప్పారు. మీకు ఏ ఆదేశం ఇవ్వడం జరిగిందో.. ఆ ఆదేశాన్ని శిరసావహించండని కుమారుడు బదులిచ్చాడు.
దీంతో కుమారుడిని బలి ఇవ్వడానికి తండ్రి సిద్ధమయ్యాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి తండ్రి దృష్టి కుమారుడి ముఖం పై పెడితే పుత్ర వాత్సల్యం అడ్డురావద్దనే ఉద్దేశ్యంతో హజ్రత్ ఇస్మాయిల్ (ఆలై)ను బోర్లా పడుకోబెట్టాడు. కత్తిని తన చేతులతో పట్టుకుని కుమారుడిని బలి ఇవ్వడానికి ఉపక్రమించడంతో అల్లాహ్ ప్రసన్నమై హజ్రత్ ఇస్మాయిల్ (ఆలై) స్థానంలో పొట్టేలును ఉంచుతాడు. ఈ ఘటనను స్మరిస్తూ ముస్లింలు బక్రీద్ పండుగను జరుపుకుంటారు. వారి త్యాగాన్ని స్మరిస్తూ ముస్లిం సోదరులు బక్రీద్ రోజు ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక నమాజు చేస్తారు. అనంతరం జంతువులను ఖుర్బానీ ఇస్తారు. ఈ ఖుర్బానీ చేసిన మాంసాన్ని మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని నిరుపేదలకు, మరో భాగాన్ని బంధువులకు, మూడవ భాగాన్ని తమ కోసం వినియెగించుకుంటారు.
పాతబస్తీలో ఊపందుకున్న జంతువుల విక్రయాలు..
బక్రీద్ పండుగ రోజున మేకలను, గొర్రెలు తదితర జంతువులను బలివ్వడం సాంప్రదాయంగా వస్తున్న నేపథ్యంలో ఆర్థిక స్థోమతకు అనుగుణంగా ముస్లింలు జంతువులను కొనుగోలు చేస్తుంటారు. నగరంలో ఎక్కడ చూసినా మేక పోతులు, గొర్రెల మందలే కనిపిస్తున్నాయి. మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మేక పోతులు, గొర్రె పొటేళ్లతో పాటు ఇతర పశువులను తీసుకువస్తున్న వ్యాపారులు రోడ్ల పక్కన టెంట్‌లు వేసి విక్రయాలు జరుపుతున్నారు. ఒక్కొక్క మేక పొట్టేలు రూ.5 వేల నుంచి 15 వేల ధర పలుకుతుంది.