తిండికి తిప్పలు.. ’అన్నపూర్ణ’ను ఆశ్రయిస్తున్న యువకులు

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా రక్కసి రోజురోజుకూ తీవ్రమవుతోంది. ప్రపంచ దేశాలను కుదిపేసిన ఈ వైరస్.., వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్ అస్త్రాన్ని ప్రయోగించాయి. ఈ లాక్ డౌన్ వల్ల అన్ని వ్యాపారాలు మూతపడ్డాయి. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు సైతం క్లోజ్అయ్యాయి. దీంతో బ్యాచ్‌లర్లకు ఎక్కడా లేని కష్టాలు వచ్చిపడ్డాయి. వంట వండటం రాక వారు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫుడ్ ఆర్డర్ చేద్దామనుకుంటే ఒకరోజు, రెండ్రోజులంటే సాధ్యమే కానీ.. ప్రతిరోజు అలా […]

Update: 2021-05-30 14:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా రక్కసి రోజురోజుకూ తీవ్రమవుతోంది. ప్రపంచ దేశాలను కుదిపేసిన ఈ వైరస్.., వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్ అస్త్రాన్ని ప్రయోగించాయి. ఈ లాక్ డౌన్ వల్ల అన్ని వ్యాపారాలు మూతపడ్డాయి. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు సైతం క్లోజ్అయ్యాయి. దీంతో బ్యాచ్‌లర్లకు ఎక్కడా లేని కష్టాలు వచ్చిపడ్డాయి. వంట వండటం రాక వారు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫుడ్ ఆర్డర్ చేద్దామనుకుంటే ఒకరోజు, రెండ్రోజులంటే సాధ్యమే కానీ.. ప్రతిరోజు అలా తినాలంటే ఆర్థిక స్థోమత సరిపోక సతమతమవుతున్నారు. దీంతో పలువురు యువకులు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ క్యాంటీన్లను ఆశ్రయిస్తున్నారు. కొందరు బ్యాచ్ లర్లు డ్రై క్లీనింగ్ కు ఇబ్బందులు పడుతుంటే.. మరికొందరు షిఫ్టుల కారణంగా నిత్యావసరాలు తెచ్చుకునేందుకు సైతం తిప్పలు పడుతున్నారు.

బయట తిందామంటే అంతా క్లోజ్

ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ లో ఉంటున్న యువకులు లంచ్, డిన్నర్ కు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంట చేసుకుందామంటే ఎలా ప్రిపేర్ చేయాలో తెలియక, బయట తిందామంటే లాక్ డౌన్ కు ప్రభుత్వం ఇచ్చిన సడలింపు సమయం పూర్తికావడంతో ఏమీ తినకుండానే పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాక్ డౌన్ వల్ల చాలా సంస్థలు వర్క్ ఫ్రం హోమ్ లాంటి అవకాశాన్ని కల్పించాయి. దీంతో చాలా మంది బ్యాచ్ లర్లు నగారాన్ని వీడి తమ స్వగ్రామాలకు వెళ్లిపోయారు. అక్కడి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు.

మరికొందరు యువకులు కొవిడ్ భయానికి సిటీ వదిలి వెళ్లారు. గతంలో రూమ్ మేట్స్ అందరూ ఉండటం వల్ల వంట చేయడం తెలిసిన ఎవరో ఒకరు ప్రిపేర్ చేస్తే అంతా కలిసి తినేవారు. లాక్ డౌన్ తో ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకే సమయం ఉండటంతో మధ్యాహ్నం, రాత్రి భోజనం బయట తిందామన్నా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు మూసివేయడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా కొందరు బ్యాచ్ లర్లు డ్రై క్లీనింగ్ ఇచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరుపలు షిఫ్టుల కారణంగా కనీసం నిత్యావసరాలు కూడా తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు.

కర్రీ పాయింట్లూ క్లోజ్..

నగరంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యువకులు ఎక్కువ శాతం కర్రీ పాయింట్లపైనే ఆధారపడతారు. కూరగాయలు కొనుగోలు చేసి వండుకునేంత తీరిక ఎక్కువ శాతం మందిలో ఉండటంలేదు. అందుకే హైదరాబాద్ లో కర్రీపాయింట్లకు గిరాకీ చాలా ఎక్కువ. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో అవి కూడా మూత పడ్డాయి. దీంతో చేసేదేంలేక యువకులంతా ఇన్ స్టంట్ ఫుడ్ మీద ఆధారపడుతున్నారు. కొందరు వంట చేయడం రాక పస్తులంటున్నారు. ఇదిలా ఉండగా బ్యాచ్ లర్ల రూముల్లో వంట చేసుకుందామంటే గ్యాస్ వంటి సదుపాయాలు సరిగ్గా లేకపోవడం ఉన్నా 3 లేదా 5 కేజీల సామర్థ్యమున్న గ్యాస్ ఉండటం వల్ల కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒక వేళ వంట చేస్తుండగా గ్యాస్ అయిపోతే తిరిగి మరుసటి రోజు నింపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇన్ స్టంట్ ఫుడ్ తీసుకుంటూ..

తెలంగాణలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. ఆ సమయం లోపు ఉదయం టిఫిన్ మాత్రమే చేయగలుగుతారు. మధ్యాహ్నం, రాత్రి భోజనం చేయడం వంటరాని వారికి కష్టంగా మారింది. రైస్ కుక్కర్ లో అన్నం వండుకొని కర్రీ తెచ్చుకుందామన్నా లాక్ డౌన్ కారణంగా కర్రీ పాయింట్లు మూసి ఉంటున్నాయి. ఒకపూట అంటే ఎలాగోలా ఆకలిని తట్టుకోవచ్చు. కానీ రెండు పూటలా అలా ఉండాలంటే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. అసలే కొవిడ్ సమయం కావడంతో సమాయానికి తినకుంటే కష్టంగా మారే అవకాశాలున్నాయి. అయితే కొందరు ఇన్ స్టంట్ ఫుడ్ పై ఆధారపడి పూట వెళ్లదీస్తుండగా మరికొందరు పండ్లు వంటివి తీసుకుంటున్నారు.

ఫుడ్ ఆర్డర్లకు సరిపోని ఆర్థిక స్థోమత

గ్రామీణ ప్రాంతాల నుంచి ఉద్యోగాలు, ఇతర పనులు చేసుకుని జీవనోపాధి పొందేందుకు నగరానికి వచ్చినవారిలో బ్యాచ్ లర్లే ఎక్కువ. చిన్నా చితక ఉద్యోగాలు చేస్తూ వచ్చిన కొంత మొత్తాన్ని ఇంటికి పంపి ఆర్థిక భారాన్ని మోస్తుంటారు. లాక్ డౌన్ కారణంగా వంట చేయడం తెలియక, ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్లు ఇచ్చి తిందామన్నా ఆర్థిక స్థోమత సరిపోక చిన్నాభిన్నమవుతున్నారు. ఒకరోజు, రెండ్రోజులు అలా తిని పొట్ట నింపుకున్నా.. ప్రతిరోజు అలా తినాలంటే ఏర్పడే ఆర్థిక ఇబ్బందులతో వారు సతమతమవుతున్నారు.

అన్నపూర్ణ క్యాంటీన్లకు పరుగులు

కొందరు యువకులు తమ ఆకలిని తీర్చుకునేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ క్యాంటీన్లకు పరుగులు తీస్తున్నారు. గతంలో రూ.5 కు భోజనం అందించగా కరోనా ఇబ్బందులు చూసి ప్రస్తుతం పేదలకు ఉచితంగా భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా ఈ క్యాంటీన్ల ద్వారా ఉచితంగానే భోజనం అందిస్తున్నారు. దీంతో క్యాంటీన్లకు సమీపంగా ఉండే బ్యాచ్ లర్లు అన్నపూర్ణ క్యాంటీన్లను ఆశ్రయిస్తున్నారు.

ఈ సమయంలో పౌష్టికాహారం లేకుంటే ఇబ్బందే..

సమయానికి తినకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా ఎక్కువ. అందులోనూ కరోనా సమయంలో సమయానికి తినకపోవడం వల్ల మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. పోషకాలు కలిగిన ఆహారం తినకుంటే ఇమ్యూనిటీ పెరగడం కూడా కష్టమే. వైరస్ సోకితే తట్టుకోవడం కష్టంగా మారుతుంది. వంట వచ్చిన వారు ప్రిపేర్ చేసుకుని తిందామన్నా ఆఫీస్ సమాయాల్లో షిఫ్టుల కారణంగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిద్ర నుంచి లేవలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కనీసం కూరగాయలు తెచ్చుకునేందుకు కూడా సమయం ఉండటం లేదు. అలా కూడా కొందరు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

స్నేహితుడి రూమ్ కి వెళ్లి తింటున్నా..

నాకు వంట చేయడం రాదు. మా రూమ్ మేట్స్ లో కొందరికి వర్క్ ఫ్రం హోమ్ అవకాశం ఇవ్వడంతో కొందరు, కొవిడ్ అంటే భయంతో కొందరు వారి ఇండ్లకు వెళ్లిపోయారు. దీంతో చేసేదేం లేక వంట చేయడం వచ్చిన మరో మిత్రుడి రూమ్ కు వెళ్లి భోజనం చేస్తున్నా. షిఫ్ట్ లో ఇబ్బందుల వల్ల నిత్యావసరాలు కూడా తెచ్చుకునేందుకు ఇబ్బందిగా మారింది. దుస్తులు ఐరన్ కు ఇవ్వాలన్నా కష్టంగా ఉంది.
= సంజీవ, వెంగళ్ రావు నగర్. ప్రైవేట్ ఉద్యోగి.

ఫుడ్ డెలివరీ మీదే ఆధారం


ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ అయితే బయట చేస్తున్నా. లంచ్, డిన్నర్ కు ఇబ్బందిగా మారింది. కర్రీ తెచ్చుకుందామన్నా లాక్ డౌన్ వల్ల పాయిట్లు మూసి ఉంటున్నాయి. వేరే మార్గం లేక ఫుడ్ డెలివరీల మీదే ఆధారపడ్డాను. ఫుడ్ డెలివరీలతో ఎక్కువ మొత్తంలో ఖర్చవుతోంది. అన్ని రంగాలకు ఇబ్బందులున్నాయి. కానీ కొన్ని అత్యవసరాలకు మరికొంత సమయం వెసులుబాటు కల్పిస్తే బాగుంటుంది.

= క్రాంతి కుమార్, కృష్ణా నగర్. సాఫ్ట్ వేర్ ఉద్యోగి.

Tags:    

Similar News