మోడీ సర్కారుతో స్నేహం.. కేసీఆర్ వ్యూహమేంటి!
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ మధ్య సంబంధాలు కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు ముందు, తర్వాత అనే తీరులో మారిపోయాయి. రైతాంగ సంఘాలు ‘భారత్ బంద్’ ఇచ్చిన పిలుపు వరకూ బీజేపీ వ్యతిరేక వైఖరితోనే టీఆర్ఎస్ వ్యవహరించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రోడ్లెక్కి ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ దూకుడును దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ చట్టాల సాకుతో ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడాలనే నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడగట్టి హైదరాబాద్‌లోనే ‘కాంక్లేవ్’ పెడతాను […]
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ మధ్య సంబంధాలు కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు ముందు, తర్వాత అనే తీరులో మారిపోయాయి. రైతాంగ సంఘాలు ‘భారత్ బంద్’ ఇచ్చిన పిలుపు వరకూ బీజేపీ వ్యతిరేక వైఖరితోనే టీఆర్ఎస్ వ్యవహరించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రోడ్లెక్కి ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ దూకుడును దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ చట్టాల సాకుతో ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడాలనే నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడగట్టి హైదరాబాద్‌లోనే ‘కాంక్లేవ్’ పెడతాను అని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. అంతటి వ్యతిరేక వైఖరి తీసుకున్న కేసీఆర్ తన ఢిల్లీ పర్యటన తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ ఎంత రెచ్చగొట్టినా కేసీఆర్ రియాక్ట్ కాకుండా సంయమనంతో వ్యవహరించారు. ఆ పార్టీ నేతలు సైతం మౌనంగానే ఉండిపోయారు. తాజాగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష పార్టీలతో జతకట్టకుండా బీజేపీకి అనుకూల వైఖరి తీసుకుంది టీఆర్ఎస్. ఒకవైపు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూనే మరోవైపు బీజేపీతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తోంది. వ్యవసాయ చట్టాల విషయంలో తమ స్టాండ్ మారలేదని, మొదటి నుంచీ అనుసరిస్తున్న వైఖరితోనే ఉన్నామని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, కేంద్రంతో కలిసి పనిచేస్తామని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను, ప్రాజెక్టులను రాబట్టుకుంటామని లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. వీరిద్దరి వ్యాఖ్యలతో బీజేపీకి వ్యతిరేకంగా ఇకపై టీఆర్ఎస్ కొట్లాట ఉండదని తేటతెల్లమైంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటాం, కలిసి పనిచేస్తాం అని కేశవరావు వ్యాఖ్యానించినా, కేంద్రంతో కలిసి పనిచేస్తూ అవసరాలను తీర్చుకుంటామని నామా నాగేశ్వరరావు చెప్పినా ఈ రెండు పార్టీల మధ్య స్నేహమే ఉంటుందని స్పష్టమైంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో బీజేపీతో, కేంద్ర ప్రభుత్వంతో టీఆర్ఎస్ వైఖరి ఎలా ఉంటుందని రెండు రోజుల క్రితం వరకూ ఆసక్తి కనబడింది. దోస్తీయా, కుస్తీయా అని రాజకీయ ఊహాగానాలూ వినిపించాయి. టీఆర్ఎస్ ఎంపీలను సమావేశపర్చి కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని, అప్పుడైనా వైఖరి స్పష్టమవుతుందని రాజకీయ పార్టీలు ఎదురుచూశాయి. కానీ రాష్ట్రపతి ప్రసంగంతో మొదలైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలి రోజునే టీఆర్ఎస్ వ్యూహం అర్థమైపోయిందని, బీజేపీతో దోస్తీనే కొనసాగిస్తుందని స్పష్టమైందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.
ఆ తరువాతే మారిన సీన్
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్, బీజేపీ ఉప్పు-నిప్పుగా వ్యవహరించాయి. సవాళ్లు విసురుకున్నాయి. దుబ్బాక సమయంలో ‘పాత బస్టాండ్’ దగ్గర చర్చకు సిద్ధమా అని చాలెంజ్ చేసుకున్నాయి. ఒక దశలో విషయం ‘అరేయ్’ వరకూ వెళ్లింది. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ‘భాగ్యలక్ష్మి’ టెంపుల్ దగ్గర ప్రమాణం దాకా వచ్చింది. ఈ రెండు పార్టీల మధ్య పోరు కాంగ్రెస్‌ను అప్రాధాన్యం చేసే స్థాయికి వెళ్ళింది. ఇంతటి వైరం ఉన్న ఈ రెండు పార్టీలు 2023 ఎన్నికల దాకా తూర్పు, పడమరగానే ఉంటాయనే రాజకీయ వాతావరణం నెలకొనింది. కానీ అలాంటి భ్రమలన్నీ రాష్ట్రపతి ప్రసంగం రోజున తొలగిపోయాయి. ప్రతిపక్షాలతో కలువకుండా ఆ పార్టీ సభ్యులు సభకు హాజరయ్యారు. బీజేపీతో తమకు వైరం లేదని, స్నేహమే ఉందనే సంకేతాన్నిఇచ్చేసారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటన తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. హఠాత్తుగా పరిణామాలు మారడానికి కారణమేంటనే ఆసక్తికరమైన చర్చ జోరుగానే సాగింది. ఇప్పటికీ మర్మం బైటకు రాకుండా ఉండిపోయింది. ఇదే అంశాన్ని బీజేపీ సైతం పలు సందర్భాల్లో ప్రస్తావించింది. ఢిల్లీలో జరిగిన చర్చల వివరాలను బహిరంగపర్చాల్సిందిగా బీజేపీ నేత బండి సంజయ్ పలుసార్లు డిమాండ్ చేశారు. అయినా టీఆర్ఎస్ నేతలు స్పందించలేదు. ఎక్కడా బీజేపీని విమర్శించలేదు. ఒకటి రెండు సందర్భాలలో ఒకరిద్దరు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినా సీనియర్ నేతలు, మంత్రులు మాత్రం సంయమనంతోనే ఉండిపోయారు. ఈ మౌనానికి కారణమేంటనేది ఆసక్తికరంగామారింది. టీఆర్ఎస్ ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు ఢిల్లీలో శనివారం చేసిన వ్యాఖ్యలతో మరింత బలం చేకూరినట్లయింది.
మా స్టాండ్ మారలేదు : కేశవరావు
రైతు చట్టాలను మేం అప్పుడూ వ్యతిరేకించాం.. ఇప్పుడూ అదే స్టాండ్‌తో ఉన్నాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నామో కూడా చెప్పాం. బిల్లుల సమయంలోనే సెలెక్ట్ కమిటీకి పంపమని డిమాండ్ చేశాం. కానీ కేంద్రం పంపలేదు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తే జనవరి 26న జరిగిన హింసను సమర్ధించడమే అవుతుంది. అందుకే రాష్ట్రపతి ప్రసంగాన్ని మేం బహిష్కరించలేదు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తోంది. కేంద్రం కూడా రైతులకు అన్యాయం చేయొద్దనే కోరుకుంటున్నాం. కానీ చట్టాలు వివాదాస్పదం కావడంతో ఇప్పుడు రైతులతో ‘ఓపెన్ మైండ్’తో చర్చలు జరుపుతోంది. మంచి పరిణామం. అయితే దీన్ని సాకుగా తీసుకుని రైతు సమస్యలు, డిమాండ్లను విస్మరించకూడదు. రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్లను కూడా ఈ సమావేశాల్లో పార్లమెంటుల ప్రస్తావిస్తాం. ఓబీసీ రిజర్వేషన్‌పై చర్చకు పట్టుబడతాం.
కేంద్రంతో కలిసి పనిచేస్తాం : నామా నాగేశ్వరరావు
కేంద్రంతో కలిసి పనిచేస్తూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు రాబట్టుకోవాలి. రాష్ట్రానికి రోడ్లు, రైల్వే ప్రాజెక్టులు చాలా రావాల్సినవి ఉన్నాయి. వాటి గురించి కూడా పార్లమెంటులో ప్రస్తావిస్తాం. ఇప్పుడు ఎన్నికలేమీ లేవు. రాజకీయాలు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. కరోనా కారణంగా దేశంలో అన్ని రాష్ట్రాలూ ఆర్థికంగా దెబ్బతిన్నాయి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతింది. దీనిపై కూడా చర్చ జరపాలని పట్టుబడతాం. రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సిన నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెస్తాం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు లాంటి పలు పథకాల గురించి రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. అనేక రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. వ్యవసాయ చట్టాల విషయంలో సైతం కేంద్రం ఆ తీరులో ఆలోచించాలి.