ఇంటిదారిలో.. 17 మంది వలస కార్మికుల ప్రాణాలు ఆవిరి
దిశ, వెబ్ డెస్క్: ఉన్న ఊరు, కన్న తల్లి దండ్రులు, కుటుంబాన్ని వదిలి వాళ్లు పని వెతుక్కుంటూ రాష్ట్రాలు దాటి వలస వెళ్లారు. పెద్ద పెద్ద హోటళ్లలో డెలివరీ బాయ్స్ గాను, క్యాంటీన్, టీ స్టాల్ లో వర్కర్లు గాను, పరిశ్రమలు, ఇతర సంస్థల్లో కార్మికులు, దినసరి కూలీలుగా పని చేసుకుంటూ పదో.. పరకో… ఇంటికి పంపుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వాళ్లది. అటువంటి వలస కార్మికుల నెత్తిన లాక్ డౌన్ అనే పిడుగు పడింది. […]
దిశ, వెబ్ డెస్క్: ఉన్న ఊరు, కన్న తల్లి దండ్రులు, కుటుంబాన్ని వదిలి వాళ్లు పని వెతుక్కుంటూ రాష్ట్రాలు దాటి వలస వెళ్లారు. పెద్ద పెద్ద హోటళ్లలో డెలివరీ బాయ్స్ గాను, క్యాంటీన్, టీ స్టాల్ లో వర్కర్లు గాను, పరిశ్రమలు, ఇతర సంస్థల్లో కార్మికులు, దినసరి కూలీలుగా పని చేసుకుంటూ పదో.. పరకో… ఇంటికి పంపుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వాళ్లది. అటువంటి వలస కార్మికుల నెత్తిన లాక్ డౌన్ అనే పిడుగు పడింది. ఎటువంటి ముందస్తు సూచనల్లేవ్, ముందుజాగ్రత చర్యల్లేవ్. ఉన్నట్టుండి అన్ని పనులు బంద్ అయ్యాయి. పని లేదు.. పైసలు లేవు. ఉండేందుకు షెల్టర్ కరువైంది. తినేందుకు ఆహారం పెద్ద సమస్యగా మారింది. ఇంటికెళ్లక తప్పని పరిస్థితి. కానీ, తిరిగి ఇంటికి వెళ్దాం అంటే లాక్ డౌన్ కారణంగా ట్రైన్ లు, బస్సులు, ప్రైవేటు వెహికల్స్ ఏవీ అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో జీవన్మరణ సమస్య ఎదుర్కొంటూ వేలాది మంది వలస కార్మికులు వందల కిలోమీటర్ల దూరంలోని సొంతింటికి ప్రయాణం కట్టారు. ఈ ప్రయాణాల్లో నలుగురు చిన్నారులు సహా 17మంది వలస కార్మికులు బలయ్యారు(శనివారం నాటికి అందిన సమాచారం). వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశమున్నది. జనవరి చివరలో దేశంలోకి ప్రవేశించిన కరోనాతో ఈ రోజు ఉదయానికి 29 మంది చనిపోయారని కేంద్రం వెల్లడించింది. కానీ, మంగళవారం రాత్రి అమల్లోకి వచ్చిన ఈ లాక్ డౌన్ ప్రతికూల ప్రభావంతో ఐదారు రోజుల్లోనే సుమారు 20 మంది వలస కార్మికులు మరణించడం గమనార్హం.
అలా వందల కిలోమీటర్ల దూరపు ప్రయాణానికి బయలుదేరిన వలస కార్మికులపై పోలీసులు విరుచుకుపడ్డారు. సామాజిక దూరం పాటించట్లేదని లాఠీలు ఝుళిపించారు. వాటిని భరించి ఆకలి దప్పికలకు ఓర్చుకుని ఆ వలస కార్మికులు పదుల కిలోమీటర్లు ప్రయాణించారు. అందులో కొందరు సొంతూరు చేరకుండానే కన్నుమూశారు. ఆకలితో, ఆయాసంతో, హార్ట అటాక్ తో… పలు కారణాలతో అర్ధాంతరంగా జీవన ప్రయాణాన్ని ముగించుకున్నారు.
ఢిల్లీలో తాను డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న రెస్టారెంట్ మూసివేయడంతో రన్వీర్ సింగ్ (39) మధ్యప్రదేశ్ లోని సొంతూరికి బయల్దేరాడు. దాదాపు రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించాక ఆగ్రా జిల్లా సమీపంలో ఛాతి నొప్పితో కుప్పకూలిపోయాడు. శుక్రవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో కన్నుమూశాడు. అటాప్సి రిపోర్టులో హార్ట్ ఎటాక్ తో చనిపోయినట్టు తేలిందని, చాలా దూరం ప్రయాణించడంతో గుండె పనితీరులో మార్పు వచ్చిందేమోనని వైద్యులు తెలిపారు.
మహారాష్ట్రలో పనిచేస్తున్న రాజస్థాన్ కార్మికులు సొంతూరికి బయలుదేరగా మహారాష్ట్ర, గుజరాత్ సరిహద్దులోని భిల్లాద్ పట్టణ పోలీసులు అడ్డుకున్నారు. ఆ ఏడుగురు కార్మికులు తిరుగు ప్రయాణం అవుతుండగా శనివారం ఉదయం ఓ ట్రక్కు ఢీ కొని అందులో నలుగురు మరణించారు. ముంబైలో క్యాంటీన్, టీ స్టాల్ లలో వాళ్లు పని చేసేవారని తెలిసింది. హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని రాయచూరుకు బయలుదేరిన వలస కార్మికుల ట్రక్ ను మరో ట్రక్ ఢీకొనడంతో ఎనిమిది మంది(18 నెలల పాప సహా) మరణించారు. లాక్ డౌన్ కారణంగా రోడ్లు బంద్ కావడంతో తమిళనాడులోని తెని జిల్లాలో పదిమంది అడవి మార్గం గుండా ప్రయాణం మొదలుపెట్టారు. కానీ రసింగాపురం దగ్గర అడవిలో అంటుకున్న మంటలకు మంగళవారం రాత్రి నలుగురు బలయ్యారు. హర్యానాలో ఇంటికి బయలు దేరిన ముగ్గురు వ్యక్తులు, ఇద్దరు పిల్లలను ఓ వాహనం ఢీకొనడంతో ప్రాణాలొదిలారు.
వలస కార్మికుల అవస్థల విషయమై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కేంద్ర ప్రభుత్వం… రాష్ట్రాల సరిహద్దులు మూసి వేయాల్సిందిగా.. వలస కార్మికులు బాగోగులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతగా తీసుకోవాలని ఆదేశించింది.