అర్జున అవార్డ్ గ్రహీత.. క్రీడా దిగ్గజం పిచ్చయ్య కన్నుమూత..
దిశ ప్రతినిధి, వరంగల్: ప్రముఖ బాల్ బ్యాడ్మింటన్ క్రీడా దిగ్గజం జమ్మల మడక పిచ్చయ్య హైదరాబాద్‌లో ఆదివారం కన్నుమూశారు. వరంగల్ దేశాయిపేటలో నివాసముండే ఆయన కొద్దిరోజులుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఈ నెల 21న 104వ పుట్టిన రోజును జరుపుకున్న పిచ్చయ్య గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం కన్నుమూసినట్లుగా ఆయన సన్నిహితులు తెలిపారు. ఆయన మృతితో రాష్ట్ర క్రీడాలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. బాల్ బ్యాడ్మింటన్ క్రీడకు విశేష సేవలందించిన ఆయనను భారత ప్రభుత్వం […]
దిశ ప్రతినిధి, వరంగల్: ప్రముఖ బాల్ బ్యాడ్మింటన్ క్రీడా దిగ్గజం జమ్మల మడక పిచ్చయ్య హైదరాబాద్‌లో ఆదివారం కన్నుమూశారు. వరంగల్ దేశాయిపేటలో నివాసముండే ఆయన కొద్దిరోజులుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఈ నెల 21న 104వ పుట్టిన రోజును జరుపుకున్న పిచ్చయ్య గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం కన్నుమూసినట్లుగా ఆయన సన్నిహితులు తెలిపారు. ఆయన మృతితో రాష్ట్ర క్రీడాలోకం శోకసంద్రంలో మునిగిపోయింది.
బాల్ బ్యాడ్మింటన్ క్రీడకు విశేష సేవలందించిన ఆయనను భారత ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది. బాల్ బ్యాడ్మింటన్ క్రీడలో ఎంతో మందిని జాతీయ స్థాయి క్రీడా కారులుగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన క్రీడా కారుల్లోని ప్రతిభను వెలికితీయడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. పిచ్చయ్య మృతి క్రీడాలోకానికి తీరని లోటని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పిచ్చయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
త్వరలోనే సినిమా ప్రారంభం.. అంతలోనే..
105 మినిట్స్ పేరుతో పిచ్చయ్య క్రీడా జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం పిచ్చయ్యను ప్రముఖ దర్శకుడు రాజు దుస్సా కలిశారు. ఆయనతో పాటు కొంతమంది పిచ్చయ్య క్రీడా జీవిత విశేషాలపై ముచ్చటించారు. కొద్దిరోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్న నేపథ్యంలో పిచ్చయ్య మరణించారు. ఆయన మరణ వార్త అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చింది.
బ్యాడ్మింటన్‌లో తొలి అర్జున అవార్డు గ్రహీత..
ఆయన పుట్టింది కృష్ణాజిల్లాలో అయినా వరంగల్‌లో స్థిరపడిపోయారు. 1936 నుంచి 1975 వరకు సుమారు 1800 టోర్నమెంట్లలో ఆడారు. పదుల సంఖ్యలో బంగారు, వెండి బహుమతులను ఆయన కైవసం చేసుకున్నారు. ఆయన బాల్ బ్యాడ్మింటన్ ఆటలో తొలి ‘అర్జున’ అవార్డును సొంతం చేసుకున్నారు. స్టార్ ఆఫ్ ఇండియా, విజార్డ్ ఆఫ్ బాల్ బ్యాడ్మింటన్ తదితర అవార్డులు పొందారు. బ్యాడ్మింటన్ క్రీడలో ఆయన ప్రతిభకు మెచ్చిన భారత ప్రభుత్వం 1970లోనే అర్జున అవార్డుతో సత్కరించింది. బ్యాడ్మింటన్ విభాగం క్రీడలో అర్జున అవార్డు అందుకున్న తొలి క్రీడాకారుడు పిచ్చయ్యే కావడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కోడూరులో నాగమ్మ, పున్నయ్య దంపతులకు మూడో సంతానంగా జన్మించారు. అన్నయ్య నారాయణమూర్తి ప్రేరణతో బాల్ బ్యాడ్మింటన్‌లో మంచి క్రీడాకారుడిగా ఎదిగారు. 1936లో బ్యాడ్మింటన్ క్రీడను మొదలుపెట్టిన ఆయన 1975 వరకు ఆడారు. పిచ్చయ్య మిత్రుడు రాధాకృష్ణ వరంగల్ అజంజాహి మిల్లులో ట్రేడ్ యూనియన్ నాయకుడిగా పనిచేసేవాడు. పిచ్చయ్య ఆటను చూసి మెచ్చుకుని మిల్లులో ఉద్యోగం ఇప్పిస్తా రమ్మని చెప్పడంతో 1947లో మకాం మార్చేశాడు. మిల్లులో ఉద్యోగం దొరకకపోయినా.. ట్రేడ్ యూనియన్ కార్యదర్శిగా నియమించి జీతం ఇచ్చేవారు.
పిచ్చయ్య పేరుమీద బ్యాట్లు..
అప్పట్లో బాల్ బ్యాడ్మింటన్ ఆటకు భలే క్రేజ్ ఉండేది. పిచ్చయ్య పేరుతో పంజాబ్‌లో తయారైన బ్యాట్లు.. దేశ వ్యాప్తంగా బాగా అమ్ముడు పోయేవి. స్వతహాగా వరంగల్ జేపీఎన్ రోడ్‌లో పిచ్చయ్య సైతం ఓ షాపు నిర్వహించినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.