టీఎస్పీఎస్సీ పాలకవర్గం కోసం పక్కా స్కెచ్ .. వారి కోసం ఆరా?
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలకవర్గానికి అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం ఒకే ఒక్కడితో ఉన్న టీఎస్పీఎస్సీకి ఈ నెలలోనే చైర్మన్‌తో పాటు నలుగురు సభ్యులను నియమించేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాత ఉమ్మడి జిల్లాల వారీగా 50 వేల పోస్టుల భర్తీకి కూడా రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో ముందుగా టీఎస్పీఎస్సీకి పాలకవర్గాన్ని నియమించాలని భావిస్తున్నారు. ఇప్పటికే జాబితాలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఏపీపీఎస్సీ సమయంలోనే చాలా మందికి […]
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలకవర్గానికి అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం ఒకే ఒక్కడితో ఉన్న టీఎస్పీఎస్సీకి ఈ నెలలోనే చైర్మన్‌తో పాటు నలుగురు సభ్యులను నియమించేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాత ఉమ్మడి జిల్లాల వారీగా 50 వేల పోస్టుల భర్తీకి కూడా రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో ముందుగా టీఎస్పీఎస్సీకి పాలకవర్గాన్ని నియమించాలని భావిస్తున్నారు. ఇప్పటికే జాబితాలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఏపీపీఎస్సీ సమయంలోనే చాలా మందికి అనర్హులకు అవకాశం ఇచ్చారనే అపవాదు ఇంకా వెంటాడుతోంది. ఈసారి అలా కాకుండా అర్హతలను కూడా ప్రమాణికంగా తీసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం.
పార్టీకా… రిటైర్డ్ అధికారికా..?
టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎంపికపై ప్రభుత్వ పెద్దలు డైలమాలో ఉన్నట్టు టాక్. అర్హుడైన పార్టీలో పనిచేస్తున్న వారిని నియామించాలా..? లేక వేరే రిటైర్డ్ అధికారిని నియమించాలా..? అన్నది తేల్చుకోలేకపోతున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఆ చైర్మన్ పదవికి ఉన్న పరిమితులు, వచ్చే విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఆచితూచి సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పేరు ప్రస్తావనకు వచ్చినా… చాలా కీలక విభాగాల్లో ఐపీఎస్ అధికారులను నియమిస్తున్నారనే విమర్శలున్నాయి.
గత కమిటీపై నిరుద్యోగుల విమర్శలు
ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సీ సభ్యుల నియామకంలో తెలంగాణకు అన్యాయం చేయడమే కాకుండా అనర్హులకు నియమించారని విమర్శలున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గాంధీభవన్‌లో టెలీ ఆపరేటర్, కడపకు చెందిన ఎల్ఐసీ ఉద్యోగికి… ఇలా సభ్యులుగా నియమించి కనీస నియమాలు పాటించకుండా నియమించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత టీఎస్పీఎస్సీకి ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఛైర్మన్‌గా, ఉద్యోగ సంఘాల నేత విఠల్‌తో పాటు చంద్రావతి, మతీనుద్దీన్ ఖాద్రీ, వివేక్, కృష్ణారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్, విద్యాసాగర్‌రావు, సాయిలు, మన్మధరెడ్డిలను సభ్యులుగా నియమించారు.కాగా వారందరి పదవీకాలం ముగిసింది. సాయిలు ఒక్కడే సభ్యుడుగా ఉండటంతో ఆయనే యాక్టింగ్ ఛైర్మన్‌గా, సభ్యుడిగా వ్యవహరిస్తున్నాడు. గత పాలకవర్గం హయాంలో ఉద్యోగాల భర్తీ ఆశించిన మేరకు చేయలేదని ఇప్పటికే నిరుద్యోగులు మండిపడుతున్నారు.
ఈసారి పర్ఫెక్ట్గా..?
కాగా ప్రస్తుతం టీఎస్పీఎస్సీకి కొత్త పాలకవర్గాన్ని నియమించేందకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురికి సీఎం నుంచి హామీ వచ్చినట్లు సమాచారం. ఛైర్మన్ అంశాన్ని మినహాయిస్తే… సభ్యులుగా ఉద్యోగ సంఘాల నుంచి కారం రవీందర్‌రెడ్డి, డాక్టర్ గండూరి వెంకటేశ్వర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు టీఎస్పీఎస్సీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న గండూరి వెంకటేశ్వర్లు కూడా అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఆయన.. టీఎస్పీఎస్సీలో అధికారి హోదాలో 26 ఏళ్లు పని చేసిన అనుభవం ఉంది. దీంతో ఈసారి ఉద్యోగ సంఘాల నుంచి ఇద్దరికి అవకాశం వస్తుందా అనే ప్రచారం కూడా జరుగుతోంది. వీరితో పాటుగా సీఎంఓలో పనిచేసే ఓ అధికారి తన బంధువుకు, సీఎస్‌కు సన్నిహితుడైన వాణిజ్య పన్నుల శాఖ మాజీ అధికారి కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీఎస్పీఎస్సీలో ఈసారి పర్ఫెక్ట్ కమిటీ ఉండాలని మంత్రి కేటీఆర్ప్లాన్ వేస్తున్నారని టాక్. దీంతో అర్హతలున్న వారికే అవకాశం ఉంటుందంటూ ప్రచారం.